విధాత : బీఆరెస్‌కు పటాన్ చెర్వు నియోజకవర్గం నేత నీలం మధు ముదిరాజ్ రాజీనామా ప్రకటించారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ముదిరాజ్ బీసీ బిడ్డగా తాను పటాన్ చెర్వు టికెట్ ఆశించానని, బీఆరెస్ అధిష్టానం మాత్రం తనకు అన్యాయం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మన్‌గా చేస్తామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు చెప్పారని, తాను మాత్రం ముదిరాజ్ ఆత్మగౌరవం కోసం తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని మాత్రమే కోరానన్నారు. అయినా బీఆరెస్ అధిష్టానం తన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు.
అందుకే బీఆరెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ నెల 16వ తేదీన కొత్తపల్లి గ్రామం నుంచి తాను చేయబోయే పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా బీఆరెస్‌కు అధికారికంగా రాజీనామా చేస్తానన్నారు. అదే రోజు తాను నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తనతో టచ్‌లో ఉన్నాయని, ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని గుర్తించి ఆ రెండు పార్టీల్లో ఎవరైన టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని, లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు.