గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 32లో
సీలింగ్ సర్‌ప్లస్ భూమిపై కబ్జాదారుల కన్ను
ఏళ్ల తరబడి కేసులు నడిపిస్తూ కుట్రలు
ప్రభుత్వ భూమిగా హైకోర్టు తీర్పులు
అయినా బరితెగించిన కబ్జాకోరులు
అర్థరాత్రి బుల్డోజర్లతో కూల్చివేతలు
నీడ కోల్పోయిన 4 కుటుంబాలు
Guttala Begumpeta | హైదరాబాద్, జూలై 2 (విధాత): శేరిలింగంపల్లి మండలం మాధాపూర్‌లోని గుట్టలబేగంపేట( Guttala Begumpeta ) సర్వే నంబర్ 32లోని 2.7 ఎకరాల భూమిని కాజేసేందుకు కబ్జాదారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ భూమినుంచి వేయవలసిన రోడ్డు పనిని కూడా కోర్టు స్టే చూపించి ఆపివేయించారు. కబ్జాదారులు సంవత్సరాల తరబడి ఆ భూమి చుట్టూ అనేక కేసులు నడిపిస్తూ ప్రభుత్వం కళ్లుగప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ అందరికీ ఆ భూమి ప్రభుత్వానిదని తెలిసినా కేసుల నుంచి భూమిని విడిపించలేకపోతున్నారు. కోర్టుల్లో కబ్జాదారుల న్యాయవాదుల రాజ్యం నడుస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైళ్లు తీసేయించడం, విచారణలో లిస్టు కాకుండా చూడడం, లిస్టయినా బెంచ్ మీదకు రాకుండా చూడటం వంటి కుట్రలు చేస్తున్నారని ఒక న్యాయవాది వాపోయారు. ఈ భూమి సీలింగ్ సర్‌ప్లస్ కిందకు వస్తుందని, ఇది ప్రభుత్వానికి చెందుతుందని జస్టిస్ సూర్యారావు, జస్టిస్ చంద్రయ్య ధర్మాసనం 2006లోనే తీర్పు ఇచ్చింది. ఈ సర్వే నంబరులో రిజిస్టర్డు సేల్ డీడ్‌తో కొనుగోలు చేసి, ఆక్రమణలో ఉన్నవారు ఆ భూమిని తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరవచ్చునని, ప్రభుత్వం చట్టాల పరిధిలో నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే ప్లాట్లు కొనుగోలు చేసినవారంతా ప్రభుత్వం నుంచి యూఎల్సీ అనుమతి తీసుకుని ఇండ్లు కట్టుకున్నారు. యూఎల్సీ లేని భూమి అంతా ప్రభుత్వ భూమే.
గతంలో రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావుకు ఈ కబ్జాదారులు ఈ భూమిని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ పిటిషన్లు పెట్టారు. ఈ భూమి ప్రభుత్వ భూమి అని, పిటిషన్లు పెట్టినవారికి ఎటువంటి టైటిల్ లేదని, వారిది అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ అని, వారికి అమ్మినవారికి కూడా భూమిపై హక్కులు లేవని రఘునందన్‌రావు 2017 నవంబరులో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ భూమిని ఎప్పుడు ఎలా సీలింగ్ సర్‌ప్లస్ భూమిగా ప్రకటించారో ఆ ఆదేశాలలో సవివరంగా పేర్కొన్నారు. అప్పటీకీ కబ్జాదారులు వదలలేదు. హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ భూమి జోలికి రాకుండా జీహెచ్ఎంసీ వారిని నిరోధించాలని, రోడ్డు నిర్మాణంపై స్టే ఇవ్వాలని కబ్జాదారులు కోరారు. జస్టిస్ చల్లా కోదండరామ్.. కబ్జాదారులు భూమి హక్కుల గురించి కలెక్టర్ వద్దకే వెళ్లాలని, తాను ఎటువంటి స్టే ఇవ్వబోనని, స్టేలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని 2020 ఏప్రిల్లో తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా సీలింగ్ చట్టం అమలులో ఉండగా ఒక వ్యక్తి 1000 చదరపు మీటర్లకు మించి భూమిని కొనుగోలు చేయడం ఎలా సాధ్యమయిందని జస్టిస్ కోదండరామ్ సందేహం వ్యక్తం చేశారు.
అయినా కబ్జాదారులు ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన అమోయ్‌కుమార్‌కు కూడా మళ్లీ పిటిషన్లు పెట్టారు. ఆయన కూడా అంతకుముందు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలనే ఇచ్చారు. మొదట చేసిన లే అవుట్లో 2.7 ఎకరాల భూమిని పార్కు భూమిగా చూపించారు. అందులో నుంచే 40 అడుగుల రోడ్డును కూడా చూపించారు. ఇప్పుడా పార్కు భూమి, రోడ్డు భూమి అంతా తమదేనంటూ మూడు నాలుగు కబ్జా ముఠాలు వివాదాలు నడిపిస్తున్నాయి. కబ్జాదారులు పాత కేసుల్లో కోర్టు ఆదేశాలను దాచిపెట్టి మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ భూమిపై అప్పటిదాకా నడిచిన వివాదాలు, కోర్టులు, రెవెన్యూ ఆదేశాలను లోతుగా పరిశీలించకుండా కబ్జాదారులకు అనుకూలంగా స్టేటస్‌కో ఇచ్చారు. కబ్జాదారులు ఆ భూమిపై స్వాధీనంలో లేకపోయినా అడ్డగోలుగా నిర్మాణ వ్యర్థాలను డంపు చేయిస్తున్నారని, వర్షాలకు ఆ డంపు అంతా కాలనీపై పడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అర్థరాత్రి కూల్చివేతలు
గుట్టలబేగంపేట రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్న సర్వే నంబర్ 32లోని దాదాపు వేయి గజాల ఖాళీ స్థలాన్ని మంగళవారం అర్థరాత్రి దాదాపు వంద మందికి పైగా గుండాలతో కొంత మంది భూ కబ్జాదారులు అక్రమించే యత్నం చేశారు. ఆ భూమిలో నాలుగు కుటుంబాలు వలస వచ్చి ఎంతో కాలంగా అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయి. ఆ నాలుగు కుటుంబాల వారిని బెదిరించి, వారిని గుడిసెల నుంచి గుంజి, వారి సామాన్లు అన్నీ విసిరి పారేసి, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు లాక్కొని బయటకు వెళ్లగొట్టారని బాధితులు వాపోతున్నారు. వెంట తెచ్చుకున్న జేసీబీతో తమ గుడిసెలను కూల్చి వేశారని చెబుతున్నారు. గుడిసెల్లో ఉంటున్న వారు తాము ఉదయమే వెళ్లిపోతామని కాళ్లమీద పడ్డా కనికరించలేదని వాపోయారు. ‘ఈ భూమి మాది… మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు’ అంటూ బెదిరించారని తెలిపారు. ఆ భూమిలో మట్టి దిబ్బలు, గుడిసెల శిథిలాలే మిగిలాయి. తిరిగి ఉదయమే ఆ ప్రాంతానికి వచ్చిన కబ్జాదారులు ఒక కంటైనర్ తెచ్చి అందులో వేశారు. అలా ఆ భూమిని కబ్జా చేసేందుకు కబ్జాదారులు యత్నించారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 50 మంది ఆ ప్రాంతంలో తిష్ఠ వేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్లు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.