సీఎం దృష్టికి ఓరుగల్లు సమస్యలు … నేడు సీఎం రేవంత్ జిల్లా పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వరంగల్ జిల్లా సమస్యలు తీసుకెళ్లేందుకు జిల్లా ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. చాలా కాలానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా ముఖ్యమంత్రి దృష్టికి జిల్లాలో నెలకొన్న సమస్యలు, అపరిస్కృత పథకాలు, ప్రాజెక్టులు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి తేనున్నారు.

  • Publish Date - June 27, 2024 / 05:42 PM IST

విధాత ప్రత్యేక ప్రతినిధి:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వరంగల్ జిల్లా సమస్యలు తీసుకెళ్లేందుకు జిల్లా ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. చాలా కాలానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా ముఖ్యమంత్రి దృష్టికి జిల్లాలో నెలకొన్న సమస్యలు, అపరిస్కృత పథకాలు, ప్రాజెక్టులు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి తేనున్నారు.గత పది ఏళ్లుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. గతంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా ఒకే బీఆరెస్‌ పార్టీకి చెందిన వారైనప్పటికీ, ముఖ్యమంత్రి, అధిష్టానంలోని ఒకరిద్దరు నాయకులు స్పందిస్తే తప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేకంగా సీఎం దృష్టికి సమస్యలు తెచ్చిన సందర్భాలు దాదాపు లేకుండా పోయాయి. ఎన్నికల సందర్భంలో తప్ప సీఎంకు సమస్యలు విన్నవించిన సందర్భాలు దాదాపు లేనే లేవు. కేటీఆర్, హరీష్ రావుల జిల్లా పర్యటన సందర్భంగా సమస్యలు వారి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు జిల్లాకు చెందిన మంత్రుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఇప్పటివరకు కొనసాగింది. ఇంకా ముఖ్య మంత్రిని కలవడం అనేది గగనంగా మారిన నేపథ్యంలో జిల్లా సమస్యలపై సీఎం స్వయంగా స్పందిస్తే తప్ప పరిష్కారం అయ్యేవి కావు. కానీ, బీఆరెఎస్ అధికారాన్ని కోల్పోయి తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మళ్లీ ఈ ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలను సీఎం దృష్టికి తీసుకపోయే విధానం తాజాగా ప్రారంభమైంది.

– ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశం

ఈ మేరకు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై రెండు జిల్లాలకు చెందిన ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ముందుగానే గురువారం ప్రజాప్రతినిధులు సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. రేపు సీఎం పర్యటన సందర్భంగా ఈ సమస్యలను ఆయన దృష్టికి తేవడంతో పాటు స్వయంగా ఆయన పరిశీలించే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ మంత్రి సీతక్కతో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

– సీఎంకు నివేదించనున్న సమస్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం కు నివేదించనున్న పలు అంశాల పై సమావేశం చర్చించింది. వరంగల్ నగరంలో అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, గీసుకొండ మండలంలో ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు సమస్యలపై చర్చించారు. ప్రాజెక్టుల కొనసాగింపు, నిధుల కొరత, అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలపై ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని నిర్ణయించారు. హనుమకొండ కలెక్టరేట్లో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రులు సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్య శారదా దేవి, ప్రావీణ్య, జిడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, పలువురు అధాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Latest News