Site icon vidhaatha

SLBC । 20 నెలల్లో శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం పూర్తి.. నెలకు 14 కోట్లు విడుదల : డిప్యూటీ సీఎం భట్టి

SLBC । శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC)ని 20 నెలల్లో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క SLBCని సందర్శించారు. అక్కడే జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SLBCని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. నెలకు 400 మీటర్ల చొప్పున సొరంగం తవ్వితే రూ 14 కోట్లు నిధులు అవసరమవుతాయని, ఆ మేరకు నెల వారీగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ లెక్కన ప్రతి నెల ఆగకుండా పని చేసి SLBC ని.. 20 నెలల్లో పూర్తి చేయడానికి అవకాశం ఉందన్నారు. రెండు సంవత్సరాలు క్యాలెండర్ నిర్ణయించుకుని ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయాలని అధికారులకు డెడ్ లైన్ ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి, ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

ఎస్ ల్ బీసీని గాలికొదిలేసిన బీఆరెస్

గత బీఆఆరెస్‌ పాలకులు గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ కూడా తవ్వకుండా శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేశారని భట్టి ఆరోపించారు. రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం… గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 4వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెను భారం పడిందన్నారు. గోదావరిపై లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరం కడితే కుంగిపోయిందని, కృష్ణానది పై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదని భట్టి ఆరోపించారు. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణ నుంచి గత పది ఏళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను… గత పాలకులు పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదన్నారు. నీళ్ల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రగతిలో ఉన్న ప్రాజెక్టును వదిలేసి రీడిజైన్ల పేరిట గత ప్రభుత్వం లక్షల కోట్లు దోపిడీ చేసిందన్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానా దివాలా తీసి ఏడు లక్షల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయని తెలిపారు. ఆ బాధతోనే గత ఏడాది మండుటెండల్లో మార్చి నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేశానన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా అన్ని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించానని, ఆ క్రమంలో ఎస్ఎల్బీసీ దగ్గరకు సైతం వచ్చానని తెలిపారు.

పెండింగ్ ప్రాజెక్ట్ లన్నీ పూర్తి చేస్తాం

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఇక్కడే కూర్చొని సమీక్ష చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని నాడు పీపుల్ మార్చ్ పాదయాత్రలో ప్రకటించానని భట్టి తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో అన్నట్టుగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందన్నారు. ఆరు నెలలు ,ఏడాది రెండు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి.. ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

డెడ్ స్టోరేజీలో నీళ్లున్నా…

ఎస్ ఎల్ బి సి పూర్తి అయితే శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీళ్లున్నా… నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతాయని భట్టి తెలిపారు. నక్కలగండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నెల నెల నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులను నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు.

Exit mobile version