Supreme Court : తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు నెలలుగా పెండింగ్‌లో ఉంచినందుకు సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌పై ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం కోరింది.

Supreme Court : తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

విధాత, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. నెలల తరబడి అనర్హత పిటిషన్లను పెండింగ్‌లో ఉంచినందుకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

సుప్రీం కోర్టు స్పీకర్‌ను ఉద్దేశిస్తూ
అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేం తీసుకోవాలా? తేల్చిచెప్పింది. అలాగే “నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటారో ఆయనే నిర్ణయించాలి… కానీ ఇది మాత్రం స్పష్టంగా కోర్టు ధిక్కారం” అని సీజేఐ అన్నారు. వారం రోజుల్లో కోర్టుకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై రోజువారీ విచారణ జరపాలని సీజేఐ సూచించారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ తరఫు న్యాయవాదులు 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తాం అని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో, సుప్రీంకోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ తీరు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.