హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న పంటల రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రూ. 2 లక్షల రుణాల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ రుణాల మాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాలకు జమ కానుది. అయితే ఈ రుణాలకు పంట రుణమాఫీ వర్తించదు అని మార్గదర్శకాల్లో రేవంత్ సర్కార్ స్పష్టంగా పేర్కొంది.
ఈ రుణాలకు మాఫీ వర్తించదు..
1. ఈ రుణమాఫీ ఎస్‌హెచ్‌జీలు, జేఎల్‌జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఇసిఎస్‌లకు తీసుకున్న రుణాలకు వర్తించదు.
2. ఈ రుణమాఫీ పునర్ వ్యవస్థీకరించిన లేదా రీ షెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు.
3. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. కానీ పీఏసీఎస్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.
4. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు, ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకోబడుతుంది.