ములుగు జిల్లాలో “మన ఇసుక వాహనం”.. అక్రమ రవాణాపై ఉక్కు పాదం.. పంపిణీలో పారదర్శకత

స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇండ్లుకు, ప్రభుత్వ చేపట్టిన నిర్మాణ అవసరాలకు కావలసిన ఇసుకను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం 'మన ఇసుక వాహనము" పేరుతో ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చింది.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 09, 2026 10:29 PM IST
ములుగు జిల్లాలో “మన ఇసుక వాహనం”.. అక్రమ రవాణాపై ఉక్కు పాదం.. పంపిణీలో పారదర్శకత

విధాత ప్రతినిధి,ములుగు:

ములుగు జిల్లా ప్రజల గృహ తదితర అవసరాలు తీర్చేందుకు జిల్లాలోని పది మండలాలలో నూతనంగా “మన ఇసుక వాహనం” పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం నుంచి ఈ పథకాన్ని లాంఛనంగా చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇండ్లుకు, ప్రభుత్వ చేపట్టిన నిర్మాణ అవసరాలకు కావలసిన ఇసుకను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం ‘మన ఇసుక వాహనము” పేరుతో ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చింది. దీని వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలతో పాటు ప్రభుత్వ నిర్మాణ కార్యకలాపలకు ఇసుక అందుబాటులోకి వస్తోందని ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ములుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తక్కువ ధరకు ఇసుక: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

సాధారణ ప్రజలకు, ఇందిరమ్మ ఇండ్లుకు, ప్రభుత్వ చేపట్టిన నిర్మాణ అవసరాలకు ఇసుకను కనిష్ట ధరకు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. చెప్పారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారం లేకుండా, అత్యంత పారదర్శకంగా నేరుగా ప్రభుత్వమే ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనుందన్నారు. ఇసుక రవాణాతో ఇబ్బందులు అదిగమించడంతో పాటు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన “మన ఇసుక వాహనం” అమలులో భాగంగా ములుగు జిల్లా లోని 10 మండలలో అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని మొట్లగూడెం, పస్రా, రాఘవపట్నం, రంగాపూర్, సోమలగడ్డ (గోవిందరావుపేట మండలంలో) గ్రామాల్లో ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. కాతిగూడెం, రాజుపేట, మరియు బోరెనర్సాపూర్ (మంగపేట మండలంలో); బుట్టాయిగూడెం (కన్నాయిగూడెం మండలంలో): దానవాయిపేట, వెంకటాపురం (జెడ్), మరియు వడగూడెం (జెడ్) (వెంకటాపురం మండలంలో); నర్సాపూర్, పంటాపూర్, ఉరట్టం, మేడారం, బొల్లేపల్లి, రంగాపూర్, మరియు కాల్వపల్లి (ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలో);కొండాయి, మానసపల్లి (ఏటూరునాగారం మండలంలో) ఇట్టి ఇసుక రీచ్ లను ఇసుకను గుర్తించి ‘మన ఇసుక వాహనం”. ఆన్ లైన్ వెబ్ సైట్ పొదుపరచడం జరిగింది.

ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోవచ్చు

ఇసుక కావలసిన వినియోగదారులు, ఆన్ లైన్ వెబ్ సైట్ (https://tsmiv.cgg.gov.in) నందు వారి వివరములను నమోదు చేసుకొని, కావలసిన ఘనపరిమాణానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి ఇసుకను నేరుగా ఇంటి వద్ద పొందవచ్చన్నారు. జిల్లా యంత్రాంగం ఇసుక రవాణా చేయాల్సిన దూరాన్ని బట్టి ధర నిర్ణయించారు. ఇసుక సరఫరా సమాచారం కొరకు స్థానిక తహసిల్దార్ ను సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, డి ఆర్ డి ఓ చంద్ర శేఖర్ రెడ్డి, ఏ డి మైన్స్ జయ రాజు, పి డి హౌసింగ్ సూర్య నారాయణ, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపి డి ఓ లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.