Komatireddy Venkat Reddy | “హరీష్ రావు ఎవరో నాకు తెలియదు. ఆయన అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేత కాదు..ఉత్తి ఎమ్మెల్యేనే. కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదు. కేటీఆర్, హరీశ్‌రావు లెక్కలోకి రారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బనకచర్ల సహా కృష్ణా గోదావరి నది జలాలతో పాటు అన్ని అంశాలపై చర్చ జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, తప్పులు చూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రోజా ఇంటికి వెళ్లి కేసీఆర్ ఏం చెప్పారు..కృష్ణ నదిలో గోదావరి నీళ్లు కలిపి రాయలసీమకు ఇస్తామన్న మాటలతో సహా అన్ని అంశాలు చర్చిస్తామని వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్లు భవనాల శాఖపై హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఆర్ఆండ్‌బీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో 99శాతం వాటా అమరులదని.. కాంగ్రెస్ పార్టీ వాటా కూడా 50శాతం అని అన్నారు. తాను కూడా మంత్రి పదవికి త్యాగం చేసి పోరాడానని.. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు తనలాగే ఆనాడు కొట్లాడారని గుర్తు చేశారు. విద్యార్థుల బలిదానాలు చూడలేక కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు.
దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపడుతామని..రాష్ట్రంలోని రోడ్ల నాణ్యత పెంచడం, అవసరమైన ప్రాజెక్టులకు వేగంగా నిధులు విడుదల కావడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా హ్యామ్ మోడల్‌లో చేపట్టబోయే రోడ్ల ప్యాకేజీలపై అధికారులతో సమీక్షించామని తెలిపారు. అవి రూపొందించిన డీపీఆర్‌లను తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు. ఆగస్టు నెల నాటికి టెండర్ ప్రక్రియ ప్రారంభించడంలో సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్యాకేజీలను గుర్తించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టంగా తెలిపామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోతాయని, మూడేళ్లలో ఆర్‌ఆర్ఆర్ పూర్తి చేస్తామన్నారు. దీనిపై ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని త్వరలో కలుస్తామని తెలిపారు. ఆరు లైన్ల రోడ్డు కోసం త్వరలోనే క్యాబినెట్ ఆమోదం లభిస్తుందన్నారు. టెండర్ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు, ఈఎన్సీ జయ భారతి, సీఈలు మోహన్ నాయక్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈలు, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.