Devadula Lift Irrigation | దేవాదుల ఎత్తిపోతల పూర్తిపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ..
దశాబ్దాలుగా పనులు సాగుతున్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని నిర్ణీత టైమ్‌లైన్‌లో పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండేళ్లలో వందశాతం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు.

- రెండేళ్లలో దేవాదులను వంద శాతం పూర్తి
- ధర్మసాగర్ వద్ద టన్నెల్ పనుల పరిశీలన
- సాగునీటిప్రాజెక్టులకు సర్కారు పెద్దపీట
- నీటి పారుదల శాఖకు రూ. 23వేల కోట్ల నిధులు
- రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
వరంగల్ ప్రతినిధి, మే 3, విధాత:
Devadula Lift Irrigation | రెండేళ్లలో దేవాదులను ప్రాజెకక్టును వంద శాతం పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. దేవన్నపేట లోని దేవాదుల పంపు హౌస్ ను సందర్శించి, త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులతో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ నిర్మాణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు.
దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే దానికి చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దేవాదుల ప్యాకెజీ-6పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ధర్మసాగర్ నుండి ఘనపూర్ రిజర్వాయర్ కు నిరంతరం రెండు పంపులు రన్నింగ్ అయితేనే స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్దన్నపేట, జనగామ నియోజకవర్గాల రైతులకు సాగు నీరు అందించగలమణి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు తెలిపారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ నిర్దేశించిన ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామన్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు.
అందుకే నీటి పారుదల శాఖకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగానే 23వేల కోట్ల నిధులను నీటి పారుదల శాఖకు కేటాయించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5లక్షల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకు అనుగుణంగానే పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నీటి పారుదల శాఖ ఉన్నతతాధికారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.