Ande Sri | పశువుల్ని మేపుతూ పాటలు గట్టి జనం చేత జై కొట్టించుకున్న సాధారణ మనిషి అందెశ్రీ( Ande Sri ). ప్రకృతే నా పాఠశాల, పల్లే నా పంతులు అని చాటాడు ప్రజా కవి. పాఠశాలకు వెళ్లి చదువుకోకున్నా.. ప్రకృతి ఒడిలోనే చదువు నేర్చుకున్న నిరక్షరాస్య కవి అందెశ్రీ. సూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి అంటూ తల్లి రుణం, పల్లె రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. మానవ సంబంధాలపై మాయమై పోతున్నాడమ్మో.. మనిషన్న వాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ పాటకట్టాడు. కొమ్మ చెక్కితె బొమ్మరా( komma chekkite bommara ).. కొలిచిమొక్కితె అమ్మరా.. ఆదికే అది పాదురా.. లేదంటే ఏదీ లేదురా అంటూ సంస్కృతిని గుర్తు చేశాడు దళిత వాడలో పుట్టి.. అశువు కవిత్వం చెప్పటంలో దిట్టగా పేరొందిన అందెశ్రీ. పశువుల కాపరిగా మొదలైన ఆయన ప్రయాణం.. ఎన్నో పురస్కారాలతో పాటు డాక్టరేట్ వరకు చేర్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి( Telangana Movement ) ఊపిరి పోసి.. ఆయన రచించిన జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం పాటు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపును పొందింది.
కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితె అమ్మరా.. పాట ఇదే
కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితె అమ్మరా
ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా
జాతి గుండెలో జీవ నదముల జాలువారే జానపదముల
గ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరోయిట
గూడుగట్ట గుహలనొదిలీ గుండె రాయి జేసుకున్నరు
కండలను కరిగించి కన్న కలలను పండించుకొన్నరు
సేదదీరి మనసులోన శక్తి ఏదో ఉన్నదనుకొని
భక్తీ యుక్తులు ధారపోయగా ముక్తి నొసగ శక్తి బుట్టె….
కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నో బెట్ట
ఇంటి ఇంటికి బోయి నను కాపాడమని కన్నీరుబెట్ట
ఎల్లరు కాదంటే మాదిగ ఇంటి లందల్లోనదాగీ
సబ్బండ జాతులు కొలువ పల్లెల కులముల ఎల్లమ్మ బుట్టె…
పల్లె సీమలు పచ్చగుండా ఊరు వాడా సిరులు నిండ
ఎటికడ్డము నీటి నిలువా కట్టడాలకు కాపు తానై
చెరువు కుంటలే కాదు బతుకు దెరువు కోసం ఏది జేసినా
మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు వోసుకున్నది
భాష మీద దాడి చేస్తిరి బతుకు మీద దాడి జేస్తిరి
భరత జాతిని తరతరాలుగా బహు విదాల బాధ పెడితిరి
ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కు లెక్కడివి
అగ్గికి చెధలెట్ల బడుతది నిగ్గదీసి అడుగుతున్న
కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా
ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా..
