తెలంగాణ ఆర్డీసీ కార్మికుల సమ్మెలో రగిలిన నిప్పు! 36 గంటల్లోనే కీలక మలుపు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 36 గంటల్లోనే కీలక పరిణామాలకు దారి తీసింది. ఒక కార్మికుడు సజీవ దహనానికి ప్రయత్నించి, ప్రాణాపాయ స్థితిలోఉండటం, మరో కార్మికుడు సైతం ఆత్మాహుతికి సిద్ధపడటంతో సమ్మె.. రానున్న రోజుల్లో భీకర రూపు దాల్చుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- నర్సంపేటలో డ్రైవర్ ఆత్మాహత్యాయత్నం
- నల్లగొండలో మరో కార్మికుడు సైతం..
- జేఏసీ పోరాట కార్యాచరణ ప్రకటన
- రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశం
- రాజకీయ పక్షాల సంపూర్ణ మద్దతు
- రాష్ట్ర సర్కారుపై పెరిగిన ఒత్తిడి
- రాష్ట్ర కేబినెట్‌లో సమ్మెపై చర్చ
- ఆర్టీసీ జేఏసీతో భట్టి చర్చలకు నిర్ణయం
- కార్మికులు తొందరపడకూడదన్న సీఎం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి చేపట్టిన నిరవధిక సమ్మె 36 గంటలకే కీలక మలుపు తిరిగింది. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ అందరూ చూస్తుండగానే బస్టాండ్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటనతో పరిస్థితి మారిపోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న శంకర్ గౌడ్‌కు ముందు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌లో చికిత్సనందించి, మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద తక్షణం స్పందించి, అవసరమైన చర్యలు తీసుకున్నారు. శంకర్ గౌడ్ ఎంజీఎంకు రాక ముందే సంఘటన సమాచారం తెలిసి ఆమె హుటాహుటిన ఎంజీఎం చేరుకుని అవసరమైన వైద్యసహాయం అందించే విధంగా ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉండగా నల్లగొండలో ఆర్టీసీ డ్రైవర్ రావుల వెంకన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తోటి కార్మికులు స్పందించి అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. ఈ వరుస సంఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
సమ్మెపై ఆత్మహత్యాయత్నం ప్రభావం
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం సంఘటన సమ్మెపై తీవ్ర ప్రభావం కనబరుస్తోంది. ఈ విషాదకర ఘటనతో కార్మికులు తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నిన్నటి వరకు పరోక్ష మద్దతునందిస్తున్న రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నేతలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. సందర్భం కోసం వేచిచూస్తున్న బీఆర్ఎస్ నాయకులు.. ఆత్మహత్యా యత్నం సమాచారం తెలియగానే అలర్ట్ అయిపోయారు. నర్సంపేట, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ ఎంజిఎంకు వచ్చి శంకర్ గౌడ్‌ను పరామర్శించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా స్పందించారు. కార్మికుల కన్నెర్ర, రాజకీయ, ప్రజాసంఘాల మద్దతుతో ఆర్టీసీ కార్మికులు పలుచోట్ల ఆవేశంతో ఊగిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. బుధవారం డిపోల వద్ద మహాధర్నాకు పిలుపునివ్వగా తాజాగా గురువారం సాయంత్రం ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర జేఏసీ తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించి, సమ్మెను ఉధృతం చేసేందుకు నిర్ణయించింది. గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కూడా సమ్మె పై సుదీర్ఘంగా చర్చించింది. కార్మిక సంఘాల జేఏసీతో మంత్రుల ఆధ్వర్యంలో చర్చించేందుకు నిర్ణయించారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదంటూ సీఎం రేవంత్ హితవు పలికారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల సర్కారు ఉదాసీనత
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 41 రోజులక్రితం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై చివరి క్షణంలో స్పందించిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం… జేఏసీతో చర్చించేందుకు ఐదుగురు ఐఎఎస్ అధికారులతో ఆగమేఘాల మీద కమిటీ ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ నేతృత్వంలో మంగళవారం కార్మిక జేఏసీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.
సంఘటనపై సర్కారుదే బాధ్యత: జేఏసీ
వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యా ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, మీడియా ఇంచార్జ్ పాటి అప్పారావు స్పందించారు. రవాణా మంత్రి చెప్పిన అబద్ధపు మాటల వలన కలత చెంది క్షణికావేశంతో శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 34 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానం చేసుకున్నారని చెబుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందిని బలితీసుకుంటుందని ప్రశ్నించారు. సమ్మెచేస్తున్న కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికవర్గం క్షణికావేశానికి లోనై ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, ఐకమత్యంతో మనమంతా కొట్లాడి మన డిమాండ్లను సాధించుకోవడానికి జేఏసీ కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

ఉద్యమ కార్యాచరణ ప్రకటన : జేఏసీ చైర్మన్ వెంకన్న
ఈ నెల 24న (శుక్రవారం) అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శనలు చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నెల 25 అన్ని డిపోలలో వంటావార్పు, 26 న అన్ని రీజియన్లలో, జిల్లాల్లో కార్మిక కవాత్, 27న రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతిప్రతాల అందజేత, 28న మహిళ ఉద్యోగులతో అన్ని డిపోలలో బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు, 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ వెంకన్న ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు సుద్దాల సురేశ్, కత్తుల యాదయ్య, బీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram