డీఎస్‌కు సీఎం సహా ప్రముఖుల నివాళి … ఘనంగా అంత్యక్రియలు

గుండెపోటుతో మృతి చెందిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం నిజమాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

  • Publish Date - June 30, 2024 / 02:32 PM IST

విధాత , హైదరాబాద్ : గుండెపోటుతో మృతి చెందిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం నిజమాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అధికారిక లాంఛనలతో నిర్వహించిన శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌, బీజేపీ సహా పలు పార్టీల కార్యకర్తలు, నాయకులు, నిజమాబాద్ జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికారు. అంతకుముందు నిజమాబాద్‌లోని శ్రీనివాస్ స్వగృహం నందు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ డి.శ్రీనివాస్‌ విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని, 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారని, డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.

 

Latest News