వరంగల్ సమగ్రాభివృద్ధి లక్ష్యం , సీఎం దృష్టికి జిల్లా సమస్యలు … మీడియాతో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వరంగల్ ప్రతినిధి:వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నేపథ్యంలో గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మీడియా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.

  • Publish Date - June 27, 2024 / 07:50 PM IST

విధాత, వరంగల్ ప్రతినిధి:వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నేపథ్యంలో గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మీడియా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా వరంగల్ టెక్స్టైల్ పార్కు కు చేరుకుంటారని అన్నారు. టెక్స్టైల్ పార్కులో ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం పూర్వ సెంట్రల్ జైల్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులపై అధికారులతో సీఎం సమీక్షిస్తారని అన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు చేరుకొని అభివృద్ధిపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. దీనికి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీగా, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రంగాలలో వరంగల్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కుడా పరిధిలోని ఇతర జిల్లాల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.

ముందుగా వరంగల్లో సమావేశాన్ని నిర్వహించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. వరంగల్ ఫైనల్ మాస్టర్ ప్లాన్ ను చర్చిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ తో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్మార్ట్ సిటీ పథకం నిధులతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా శక్తి రుణాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దశల వారిగా నగర అభివృద్ధి, మామునూరు ఎయిర్పోర్ట్, కాళోజీ కళాక్షేత్రంపై కూడా చర్చించే అంశాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

**

Latest News