Site icon vidhaatha

మేమూ రెడ్‌బుక్ రాస్తున్నాం … బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

బూడిదతో మంత్రి పొన్నంకు రోజుకు 50లక్షల ఆదాయం

విధాత : అధికార పార్టీలకు కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్న అధికారుల పేర్లును రెడ్‌బుక్‌లో రాస్తున్నామంటూ చెబుతున్న నేతల జాబితాలో తాజాగా బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా చేరిపోయారు. బీఆరెస్ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి రెడ్‌బుక్(డైరీ) రాస్తున్నామని మేం అధికారంలోకి వచ్చాకా మమ్మల్ని వేధించిన అధికారుల పని పడుతామని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ హయాంలో టీడీపీ నేత నారా లోకేశ్ కూడా రెడ్‌బుక్ రాస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అదే కోవలో తాజాగా పాడి కౌశిక్‌రెడ్డి సైతం తమ పార్టీని వేధిస్తూ అధికార పార్టీకి ఏజెంట్లు మారిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నామంటూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో కౌశిక్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. రామగుండం ఫ్లై యాష్‌(బూడిద) తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బూడిద తరలింపులో మంత్రి అదనంగా రోజుకు రూ.50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న 13 లారీలను తానే స్వయంగా పట్టుకున్నట్లు తెలిపారు. బూడిద అక్రమ రవాణాతో మంత్రి పొన్నం 100కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. రవాణా శాఖ అధికారులు రెండు లారీలను మాత్రమే సీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడే అందరి పేరు రెడ్ బుక్‌లో రాస్తున్నామని, మేం అధికారంలోకి వచ్చిన నాడు వారికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని, ఇది బెదిరింపు కాదు, మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. అక్రమార్కులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని హరీశ్‌రావు రాజీనామా లేఖ సిద్ధం చేసుకోమని విప్ ఆదిమూల శ్రీనివాస్ మాట్లాడిన వ్యాఖ్యలకు బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ వేశారు. హరీశ్ చెప్పినట్లుగా ఆరు గ్యారంటీలు 13హామీలు చేస్తే హరీశ్‌రావుతో పాటు 39మంది బీఆరెస్‌ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, లేదంటే మీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version