Tourism | ఆది కైలాస్‌, ఓమ్‌ పర్వత్‌ దర్శనాలు.. హెలికాప్టర్‌లో 5 రోజుల టూర్‌.. ప్యాకేజీ ఎంతంటే..!

  • Publish Date - April 11, 2024 / 11:01 AM IST

Tourism : దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం దినదినాభివృద్ధి చెందుతున్నది. ఆధ్యాత్మిక పర్యాటకానికి పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర పర్యాటక శాఖతోపాటు వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కొండలు, గుట్టల్లో ఉన్నాయి. ఆది కైలాస్‌, ఓమ్‌ పర్వత్‌లకు వెళ్లాలంటే చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఈ క్రమంలో అక్కడ హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

థామస్‌ కుక్‌ ఇండియా కంపెనీ, తన గ్రూప్‌ సంస్థ అయిన ఎస్‌ఓటీసీ ట్రావెల్‌లు.. ఆది కైలాస్‌, ఓమ్‌ పర్వత్‌లకు వెళ్లే ఆధ్మాత్మిక పర్యాటకులకు హెలికాప్టర్‌ సేవలు అందించడం కోసం ఉత్తరాఖండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (యూటీడీబీ) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఆది కైలాశ్‌, ఓమ్‌ పర్వత్‌లకు వెళ్లానుకునే పర్యాటకులకు ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌ బేస్‌క్యాంపుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆది కైలాస్‌, ఓమ్‌ పర్వత్‌లకు పర్యాటకులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి, తీసుకురావడానికి ఐదు రోజులు పడుతుంది.

ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక పర్యాటకానికి ఒక్కో వ్యక్తికి రూ.90 వేలు వసూలు చేయనున్నారు. ఉత్తరాఖండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ బోర్డు సబ్సిడీపోను ఈ ధరను నిర్ణయించింది. కాగా, ఈ ఐదు రోజుల టూర్‌లో ప్రతి బ్యాచ్‌లో 14 మంది ఉంటారని కంపెనీ తెలిపింది. హెలికాప్టర్‌పై ఆది కైలాశ్‌, ఓమ్‌ పర్వత్‌ దర్శనాలు, పార్వతి సరోవర్‌ ఆలయానికి ఏటీవీ (ఆల్‌ టెరెయిన్‌ వాహనంలో) ప్రయాణం, అన్ని రోజులకు భోజనాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయని తెలిపింది.

Latest News