IRCTC Tourism | హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. సమ్మర్‌లో కర్నాటక వెళ్లేందుకు స్పెషల్‌ ఎయిర్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

  • Publish Date - March 17, 2024 / 05:16 AM IST

IRCTC Tourism | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సమ్మర్‌లో వివిధ కర్నాటకలోని పలు ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లాలని భావిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని విమానంలో సాగుతుంది. ‘డివైన్‌ కర్నాటక’ పేరుతో స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఐదురాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ పర్యటన హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్యాకేజీ ఏప్రిల్‌ ఒకటో తేదీన అందుబాటులో ఉన్నది.

పర్యటన సాగేదిలా..

తొలిరోజు ఏప్రిల్‌ ఒకటిన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస ఉటుంది. మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకొని ఉడిపికి వెళ్తారు. మేరీ ఐల్యాండ్, మాల్ప్‌ బీచ్‌లను సందర్శిస్తారు. ఇక రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది. మూడో రోజు ఉదయం హోటల్‌లోనే అల్పాహారం పూర్తి చేసుకొని.. ఉడిపి నుంచి హారనాడుకి ప్రయాణమవుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం అనంతరం శృంగేరి ఆలయాన్ని వీక్షిస్తారు. సాయంత్రం మళ్లీ ఉడిపి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస ఉంటుంది. నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్‌ చేసుకొని ఉడిపి నుంచి కొల్లూరు, గోఖర్గం, మురుడేశ్వర్‌ వెళ్తారు. రాత్రి మురుడేశ్వర్‌లోనే బస ఉంటుంది. ఐదో రోజు మురుడేశ్వర్‌లో ఆలయ సందర్శనకు వెళ్తారు. అక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్య వెళ్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది. ఆరో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తర్వాత మధ్యాహ్నం మంగళూరుకు బయలుదేరుతారు. సాయంత్రం మంగూళురు ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం ఉంటుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఎంతంటే..?

డివైన్‌ కర్నాటక ఎయిర్‌ ప్యాకేజీలో సింగిల్ షేరింగ్‌కు రూ.44,200.. డబుల్ షేరింగ్‌కు రూ.34వేలు, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.32,500గా నిర్ణయించారు. హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్నర్‌ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. ఏసీ వాహనంలో ప్రయాణం ఉంటుంది. అలాగే, ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సైతం వర్తిస్తుంది. మధ్యాహ్న భోజనంతో పాటు అదనంగా ఏదైనా తినాలని భావిస్తే ప్రయాణికులే వెచ్చించాల్సి ఉంటుంది. విమానంలో భోజనం, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్‌.. గైడ్‌ ఫీజులతో పాటు సాధారణ మెనూలో లేని లాండ్రీ ఖర్చులు, వైన్, మినరల్ వాటర్, ఆహారం, డింక్స్‌ తదితర ఖర్చులన్నీ ప్రయాణికులే అదనంగా పెట్టుకోవాల్సి ఉంటుందని ఐఆర్‌టీసీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరింది.

Latest News