Viral Video | శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!

చనిపోయిన వ్యక్తి పరలోకంలోనూ రాజభోగాలు అనుభవించాలని చైనాలోని ఓ కుటుంబం వింత పనిచేసింది. అంత్యక్రియల సందర్భంగా మృతదేహంతో పాటు కోటిన్నర విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును పూడ్చిపెట్టింది. ఈ ఖననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించాయి.

Viral Video | చనిపోయిన వ్యక్తి పరలోకంలోనూ రాజభోగాలు అనుభవించాలని చైనాలోని ఓ కుటుంబం వింత పనిచేసింది. అంత్యక్రియల సందర్భంగా మృతదేహంతో పాటు కోటిన్నర విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును పూడ్చిపెట్టింది. పైగా ఆ లగ్జరీ కారుకు 8888 అనే ఫ్యా్న్సీ నంబర్‌ను కూడా తీసుకోవడం గమనార్హం. ఈ ఖననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించాయి.

ఈశాన్య చైనాలోని లియోవోనింగ్ ప్రావిన్స్‌లో నివసించే జిన్ కుటుంబం చాలా రిచ్. ఇటీవల తమ బంధువు ఒకరు చనిపోవడంతో అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని గౌరవార్థం 15 లక్షల యువాన్లు (దాదాపు రూ.1.49 కోట్లు) విలువైన మెర్సిడెస్ బెంజ్ S450L కారును కూడా సమాధి చేసింది. పెద్ద ఎక్స్‌కవేటర్‌తో కారును గుంతలో దింపి దానిపై మట్టి కప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

సమాధిలో పూడ్చిన కారుకు 8888 నంబర్ ఉండటం మరో విశేషం. చైనాలో ఈ సంఖ్యను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. చనిపోయిన వ్యక్తి మరణం తర్వాత కూడా పరలోకంలో రాజభోగాలు, హోదా దక్కించాలనే ఉద్దేశంతోనే ఈ పనిచేసినట్లు జిన్ కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పనిచేసే కారును అలా మట్టిలో కలపడం వృథా అని చాలామంది మండిపడుతున్నారు. కారులోని బ్యాటరీలో, ఆయిల్ వల్ల భూమి కలుషితం అవుతుందని మరికొంతమంది పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొందరు మాత్రం కుటుంబ ఆచారాలు, విశ్వాసాలను గౌరవించాలని జిన్ కుటుంబానికి మద్దతు పలకడం గమనార్హం.

లగ్జరీ కారును ఖననం చేసిన వీడియో వైరల్ కావడంతో స్థానిక అధికారులు స్పందించారు. వీటిని మూఢనమ్మకంగా కొట్టిపారేసింది. ఇలాంటి పనుల వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని జిన్ కుటుంబాన్ని మందలించింది. ఈ క్రమంలో జిన్ కుటుంబం ప్రజలకు క్షమాపణలు తెలిపింది.

Latest News