Noorjahan Mango | 3 కిలోల మామిడి.. ఒక్కోటి రూ.వెయ్యి.. నూర్జహాన్‌కు పెరుగుతున్న డిమాండ్

ఈ వేసవికాలంలో నూర్జహాన్ అనే కొత్త రకం మామిడి ప్రత్యేకంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని కత్తివాడలో మాత్రమే సాగయ్యే ఈ మామిడి రకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీనికి కారణం దీని సైజ్‌నే. మూడు కిలోల వరకు బరువు పెరిగే ఈ మామిడి కాయ ఒక్కోటి రూ.1000 వరకు పలుకుతుంది.

Noorjahan Mango | వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్ అంతా మామిడి పండ్ల సువాసనతో కళకళలాడుతుంది. బంగినపల్లి, ఆల్ఫోన్సో, దసేరి, తోటపురి వంటి రకాల మామిడి పండ్లతో నిండిపోయి ఉంటాయి. వాటి మధ్యలో ఇప్పుడు నూర్జహాన్ అనే అరుదైన మామిడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒక్కొకటి మూడు కిలోల వరకు పెరిగే ఈ మామిడి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది.

చిన్నబుట్టంత సైజ్.. ఆశ్చర్యపరిచే రూపం

నూర్జహాన్ మామిడి రకానికి దాని పరిమాణమే అసలైన ప్రత్యేకత. సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఒక్కో మామిడి మూడు నుంచి 3.5 కిలోల వరకు బరువు, ఒక్క అడుగు పొడవు పెరుగుతుంది. ఈ మామిడి పండును చేతిలో పట్టుకుంటే చిన్న బుట్టంత కనిపిస్తుంది. దీంతో ఈ పెద్ద సైజ్ మామిడి పండ్లు చూసినవారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక దీని ధర విషయానికి వస్తే ఒక్కో కాయ రూ. వెయ్యి వరకు పలుకుతుంది.

రుచి కూడా అదిరిపోయే స్థాయిలోనే..!

కేవలం సైజ్‌లో మాత్రమే కాదు రుచిలో కూడా నూర్జహాన్ ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ పండులోని గుజ్జు కుంకుమ పువ్వు రంగులో ఉండి తియ్యగా, మృదువుగా ఉంటుంది. పలుచటి తొక్క, సుగంధభరితమైన వాసన ఈ రకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ లక్షణాల వల్లే దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోని దీనికి మంచి ఆదరణ దక్కింది.

చరిత్ర నుంచి వచ్చిన అరుదైన మామిడి

మొఘల్ రాణి నూర్జహాన్ పేరు మీదనే ఈ మామిడి రకం ప్రాచుర్యం పొందింది. ఆఫ్ఘానిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ మామిడి శతాబ్దాల కిందట గుజరాత్ నుంచి భారత్‌కు చేరింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ వాతావరణానికి అలవాటు పడింది. ప్రస్తుతం ఈ రకం మామిడి అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కత్తివాడలోని శివరాజ్ సింగ్ జాదవ్ అనే రైతు కుటుంబం 1965 నుంచే ఈ నూర్జహాన్ మామిడిని సాగు చేస్తున్నాయి.

అమోఘమైన రుచికి.. ఓపిక ఎంతో ముఖ్యం

మిగిలిన మామిడి చెట్లతో పోలిస్తే వీటిని సాగు చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఒక్క చెట్టు పూర్తిగా పండ్లు కాయడం మొదలవ్వడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. కాబట్టి అప్పటివరకు సహనంతో దీన్ని సాగు చేస్తూ ఉండాలి. పైగా సరైన నేల, వాతావరణం, నీటి నిర్వహణ ఉంటేనే ఈ రకం మామిడి పండుతుంది. ఇక ఇది జనవరి – ఫిబ్రవరి మధ్యలో పూతకు వస్తుంది. జూన్ నాటికి పండ్లు కోతకు సిద్ధమవుతాయి.

సోషల్‌మీడియాతో మరింత క్రేజ్!

ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన ఈ నూర్జహాన్ మామిడి సాగు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో టీవీ కార్యక్రమాల ద్వారా కొంత పేరు వచ్చినప్పటికీ.. సోషల్ మీడియా విస్తరణ తర్వాత ఈ మామిడి రకానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ప్రతి ఏటా ఈ మామిడి ఫారాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు.

విదేశాల్లోనూ డిమాండ్

ఈ మామిడి ప్రస్తుతం భారత్‌లోనే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. భారీ పరిమాణం, ప్రత్యేక రుచి కారణంగా విదేశీయులు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు.

Read More:

Mangoes | మామిడి పండ్లు మిస్సవుతున్నా అని చెప్పిన ఉద్యోగిని.. లండన్ నుంచి సర్‌ప్రైజ్ ఇచ్చిన బాస్!

Mango Map | బంగినపల్లి నుంచి ఆల్ఫోన్సో వరకు.. భారత్‌లో దొరికే 14 మామిడి రకాల సీజన్ మ్యాప్ వైరల్!

Latest News