Emergency Alert | ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్‌లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!

భూకంపాలు, తుఫాన్లు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొబైల్ ఫోన్లకు అలర్ట్స్ పంపి ప్రజలను అప్రమత్తం చేసే టెక్నాలజీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌'‌‌ను పరీక్షిస్తోంది.

Emergency Alert | దేశవ్యాప్తంగా చాలా మొబైళ్లకు అలారం శబ్ధంతో కూడిన వార్నింగ్ మెసేజ్‌లు రావడం ఇటీవల ఆందోళన కలిగించింది. పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా ఫ్లాష్‌ మెసేజ్‌లు రావడంతో చాలామంది కంగారుపడిపోయారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ అనే తేడా లేకుండా ఈ ఎమర్జెన్సీ మెసేజ్‌లు రావడంపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) అధికారులు స్పందించారు.

భూకంపాలు, తుఫాన్లు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల మొబైళ్లకు వేగంగా అలర్ట్ పంపించడానికి అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీని పరీక్షించడంలో భాగంగానే ఈ ఫ్లాష్ మెసేజ్‌లు పంపించామని తెలిపారు. ఇది ఎలాంటి ప్రమాద సూచిక కాదని.. పరీక్షల్లో భాగమేనని స్పష్టం చేశారు.

అసలేంటి ఈ వ్యవస్థ?

ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ది చేసిన ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌’ పరీక్ష దశలో ఉంది. ఈ కొత్త విధానం ద్వారా భవిష్యత్తులో సునామీ, భూకంపాలు, మెరుపులు, గ్యాస్ లీక్‌లు, రసాయన ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ హెచ్చరికలను ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా చేరుస్తారు. అలర్ట్ వచ్చినప్పుడు ఫోన్‌లో గట్టిగా అలారం శబ్ధం వినిపించడంతో పాటు, స్క్రీన్‌ఫై ఫ్లాష్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. ఈ కొత్త విధానం ద్వార అత్యవసర హెచ్చరికలు మరింత వేగంగా, విశ్వసనీయంగా ప్రజలకు చేరే అవకాశం ఉంది.

అలర్ట్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది?

టెలికాం శాఖ(DoT), జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌ ప్రయోగాలు నిర్వహిస్తాయి. ఈ స్వదేశీ టెక్నాలజీని అధికారికంగా ప్రారంభించే ముందు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌ల్లో పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మొబైల్ వినియోగదారులకు ఇంగ్లీష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ టెస్ట్ అలర్ట్‌లు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ సెట్టింగ్స్ ఆన్ చేసిన ఫోన్లకే వస్తున్నాయి.

అలర్స్ రావాలంటే ఏం చేయాలి?

ముందు ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో Safety&Emergency విభాగంలోకి వెళ్లి Wireless Emergency Alerts సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కనిపించిన Test Alertsను ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఈ టెస్ట్ అలర్ట్‌లు వస్తాయి.

ఇప్పటికే ఉన్న సిస్టమ్‌.. మరింత బలోపేతం

ఈ కొత్త సిస్టమ్ ఇప్పటికే ఉన్న SACHET (ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్) బలోపేతానికి పనిచేస్తుంది. దీనిని టెలికాం పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. ప్రకృతి విపత్తులు, వాతావరణ హెచ్చరికలు వంటి సందర్భాల్లో ఇప్పటివరకు 134 బిలియన్ కంటే ఎక్కువ ఎస్ఎంఎస్ అలర్ట్ పంపిస్తుంది. అయితే ఈ ఎస్ఎంఎస్ విధానంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. నెట్‌వర్క్ బిజీగా ఉన్నప్పుడు మెసేజ్‌లు ఆలస్యంగా చేరే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. ఇది ఒకేసారి నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లను పంపిస్తుంది. దీంతో సునామీ, భూకంపాలు, గ్యాస్ లీక్ వంటి అత్యవసర సమయాల్లో చాలా వేగంగా హెచ్చరికలు అందుతాయి.

త్వరలోనే పూర్తిస్థాయి అమలు!

ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌‌ను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది అంతర్జాతీయ ప్రమాణికమైన కామన్ అలర్టింగ్ ప్రొటోకాల్ (CAP)కి అనుగుణంగా పనిచేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రయల్స్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్ సామర్థ్యం, మెసేజ్ డెలివరీ వేగం, విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యాక దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు టెస్ట్ సెట్టింగ్స్‌ ఆన్/ఆఫ్‌నకు సంబంధం లేకుండానే అత్యవసర పరిస్థితుల్లో ప్రతి మొబైల్ వినియోగదారుడికి ప్రాంతానుసారంగా హెచ్చరికలు పంపిస్తారు. ఇందులో ఇంగ్లీష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ మెసెజ్‌ అలర్ట్‌లను పంపించనున్నారు.

Read More:

మరో స్కైలాబ్‌? భూమిపై పడిపోనున్న స్పేస్‌ టెలిస్కోప్‌.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం

Watermelon | ముంబై ఘటనతో హడల్.. రాత్రికి రాత్రే రూ.5కి పడిపోయిన పుచ్చకాయ ధర!

Latest News