పాములకు పేర్లు పెట్టడం అంత ‘వీజీ’ కాదు.. సుదీర్ఘ ప్రక్రియ తెలిస్తే షాకే

‘ఒఫియోఫాగస్‌ హన్నా’ అంటే ఎంత మందికి తెలుసు? పోనీ.. ‘నాజా నాజా’ అని దేన్ని పిలుస్తారు? ‘కామన్‌ క్రైట్‌’ మీకు ఎప్పుడైనా కనిపించిందా? అది కూడా వదిలేద్దాం.. ‘యూనెక్టెస్ మురినస్’ గురించి ఎప్పుడన్నా చదివారా? ఏంటివి అనుకుంటున్నారా? ఇవన్నీ పాములు. పాముల శాస్త్రీయ నామాలు. కింగ్‌ కోబ్రా, నాగుపాము, కొండచిలువ, రక్తపింజర, జెర్రిగొడ్డు.. ఇన్నీ వాడుకలో ఉండే పేర్లు. కానీ.. వాటిని శాస్త్రీయ పరిశోధనల్లో సక్రమంగా గుర్తించేందుకు శాస్త్రీయంగా నామకరణం చేస్తారు.

  • By: TAAZ |    trending |    Published on : Apr 30, 2026 4:43 PM IST
పాములకు పేర్లు పెట్టడం అంత ‘వీజీ’ కాదు.. సుదీర్ఘ ప్రక్రియ తెలిస్తే షాకే

పాములకు శాస్తీయ నామకరణం యాదృచ్ఛికంగా, అనాలోచితంగా లేదా పాము కనిపించినప్పుడు అక్కడిక్కడే పేరు పెట్టడం ఉండదు. దీనికి పెద్ద కథే ఉంది. ఎప్పుడైనా, ఎక్కడైనా కొత్త తరహా పాము కనిపించినప్పుడు.. దానిపై పెద్ద ఎత్తున పరిశోధన, అధ్యయనం సాగుతాయి. దాని శరీర నిర్మాణం, దాని ప్రవర్తనను బట్టి.. దానికి ఒక శాస్త్రీయ నామం ఖరారు చేస్తారు. అప్పటి నుంచి ఆ పామును శాస్త్రీయంగా అదే పేరుతో పిలుస్తారు.

జంతువులు, ప్రత్యేకించి పాములకు శాస్త్రీయనామకరణం ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్న శాస్త్రీయ వర్గీకరణ వ్యవస్థలో ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కింగ్‌ కోబ్రా లేదా కొండచిలువకు సైన్స్‌ ఆధారంగా కఠిన ప్రక్రియ అనంతరం పేర్లు ఖరారవుతాయి.

ఈ సృష్టిలోని జీవులకు శాస్త్రీయ నామకరణ ప్రక్రియను ‘ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ జులాజికల్‌ నొమెన్‌క్లేచర్‌ అనే సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. రెండు వేర్వేరు జాతులకు ఒకే శాస్త్రీయనామం ఖరారుచేయకుండా ఇది గ్యారెంటీ ఇస్తుంది. అదే సమయంలో మొదటగా పబ్లిష్‌ చేసిన పేరు మాత్రమే చెల్లుతుంది. ఒకసారి ఒక పేరును పబ్లిష్‌ చేసిన తర్వాత మరో జాతికి ఆ పేరు పెట్టడం సాధ్యం కాదు.

King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?

పేరు పెట్టే ప్రక్రియ ఎలా మొదలవుతుంది?

శాస్త్రవేత్తలు తమకు కొత్త రకం పాములు లేదా విచిత్రంగా ఉన్నపాములు ఎదురైతే వాటికి శాస్త్రీయ నామం ఇచ్చే ప్రక్రియ మొదలవుతుంది. చాలా వరకూ అటవీ ప్రాంతాలు, చిత్తడి నేలలు, లేదా వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం ఉండే సహజ ఆవాస ప్రాంతాల్లో కొత్త పాములు తారసపడుతూ ఉంటాయి. సదరు జంతువు లేదా ప్రాణిని గుర్తించిన తర్వాత.. నిపుణులు క్షుణ్ణంగా పరీక్షిస్తారు. సదరు ప్రాణి పొడవు, వెడల్పులు, రంగు, ప్రవర్తన, ఆవాసం వంటి వివరాలు సేకరించి, విశ్లేషిస్తారు. కొన్ని కేసులలో వాటి ఫొటోలు, వీడియోలు కూడా తీసుకొని పరిశోధిస్తారు. అప్పటికీ ఒక నిర్ధారణకు రారు. క్షేత్రస్థాయి నుంచి బలమైన వివరాలను క్రోడీకరించుకుంటారు. అనంతరం తాజాగా కొనుగొన్న పాము, ఇతర జాతులతో ఎలా భిన్నమైనదో గమనిస్తారు. చాలా సార్లు కొన్ని పాములు ఒకేలా కనిపించినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన తేడాలు ఉంటాయి. అందుకే లోతైన పరిశోధన చేస్తారు. అది ముమ్మాటికీ కొత్తగా కనిపించిన జాతి ప్రాణి అని ధృవీకరించుకుంటారు. అంటే.. సదరు పాము శరీర నిర్మాణం, పొలుసులను కలిగి ఉన్న తీరు, తల ఆకారం వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పటికే అటువంటి పాములు ఏమైనా గుర్తించారా? అనే విషయాన్ని గమనిస్తారు. ఇది కొత్త పామేనని రూఢీ అయ్యాక లాంఛన నివేదికను సిద్ధం చేస్తారు. ఈ నివేదికలో దాని ఆవాసం, అది మిగిలిన జాతుల కంటే ఎందుకు భిన్నం? అనే వివరాలతో పాము పూర్తిస్థాయి వర్ణన ఉంటుంది. ఈ వివరాలను గుర్తింపు పొందిన సైన్స్‌ జర్నల్‌లో కచ్చితంగా పబ్లిష్‌ కావాలి. లేనిపక్షంలో దానిని పరిగణనలోకి తీసుకోరు. అంతేకాదు.. దాని కచ్చితత్వాన్ని ధృవీకరించేందుకుగాను.. పబ్లిష్‌ చేసిన పత్రాన్ని నిపుణులు రివ్యూ చేసి ఉండాలి. అప్పుడు ఆ పాముకు శాస్త్రీయ నామాన్ని నిర్దేశిస్తారు.

పాములకు రెండేసి పేర్లు

ప్రతి పాముకు రెండు పదాలతో పేరు పెడతారు. మొదటి పదం ఆ పాము ఏ ప్రజాతికి చెందినదో చెబుతుంది. రెండవది.. ఆ గ్రూపులో దానికి ఉన్న నిర్దిష్టతను చెబుతుంది. ఉదాహరణకు కింగ్‌ కోబ్రాను ఒఫియోఫాగస్‌ హన్నా అని శాస్త్రీయంగా పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల పేర్లు, సంస్కృతులు కూడా జోడిస్తుంటారు. కొండచిలువకు ఉన్న పైథాన్‌ అనే పేరు గ్రీక్‌ పురాణాల్లోని ‘పైథో’ అనే పదం నుంచి వచ్చింది. అదే విధంగా.. రస్సెల్స్‌ వైపర్‌ అనే పేరు ప్యాట్రిక్‌ రస్సెల్‌ అనే ప్రకృతి ప్రేమికుడి పేరు నుంచి తీసుకున్నారు. భారతదేశంలో సర్పాలపై అధ్యయనంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా వైపర్‌కు ముందు రస్సెల్‌ అనే పదం జోడించారు. అంటే.. ఒక విధంగా ఈ పేర్లు చరిత్రను కూడా అనుసంధానం చేస్తుంటాయి.

Read Also |

Keelback Snakes | దేశంలోకి కొత్త పాములొచ్చాయ్…
High Speed Camera Snake Bites | స్లోమోషన్‌లో పాము కాటు వీడియోలు.. చూస్తే గుండెలు గుభేలే!
ఐఏఎస్‌లతో రేవంత్‌ చెడుగుడు.. చీటికిమాటికి బదిలీలు