ఐఏఎస్‌లతో రేవంత్‌ చెడుగుడు.. చీటికిమాటికి బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల పోస్టింగ్స్‌ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెడుగుడు ఆడుతున్నారన్న అభిప్రాయాలు అధికారవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఏ ఐఏఎస్‌ ఏ శాఖలో ఉన్నారో అర్థం కాని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తున్నది.

ఐఏఎస్‌లతో రేవంత్‌ చెడుగుడు.. చీటికిమాటికి బదిలీలు
  • 2 నెలలు తిరక్కుండానే సంజయ్ ట్రాన్స్‌ఫర్‌
  • సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు గాలికి
  • సివిల్ సర్వీసెస్ బోర్డు ఉన్నట్లా లేనట్లా?
  • ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఘోరంగా లేదంటున్న పరిశీలకులు

విధాత, హైదరాబాద్:

తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల పోస్టింగ్స్‌ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెడుగుడు ఆడుతున్నారన్న అభిప్రాయాలు అధికారవర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఏ ఐఏఎస్‌ ఏ శాఖలో ఉన్నారో అర్థం కాని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తున్నది. మూడు నెలలు, ఆరు నెలలు తిరక్కుండానే బదిలీలు చేస్తుండటంతో పరిపాలనలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయిలో బదిలీలు జరగలేదని అంటున్నాయి. ఐఏఎస్‌ల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లను ఫుట్ బాల్ ఆడుకున్నట్లుగా బదిలీలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఘోరంగా స్వల్ప సమయంలో బదిలీ చేయలేదని, కనీసం రెండేళ్ళ పాటు కొనసాగించారని ఒక అధికారి గుర్తు చేసుకున్నారు.

రెండు నెల్లలోనే ఢిల్లీకి సంజయ్‌ కుమార్‌

  • పంచాయత్ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్‌ను రెండు నెలలు తిరక్కుండానే న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.
  • హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా దాసరి హరిచందనను ఏడాది పూర్తి కాకుండానే అక్కడి నుంచి కార్మిక శాఖకు బదిలీ చేశారు.
  • మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న బోయి విజయేందిరను ఫిబ్రవరి నెలాఖరులో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా బదిలీ చేశారు.
  • మళ్లీ తాజాగా ఆమెను అక్కడి నుంచి ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శిగా నియమించారు.
  • గతేడాది జూన్ నెలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పీ ప్రావీణ్యను నియమించిన ప్రభుత్వం.. ఏడాది పూర్తి కాకుండానే మళ్లీ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేసింది.
  • గద్వాల జోగులాంబ కలెక్టర్‌గా ఉన్న బీఎం సంతోష్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నియమించారు.
  • తాజా బదిలీల్లో అక్కడి నుంచి సచివాలయంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేశారు.
  • ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టిని గతేడాది జూన్ నెలలో నియమించి, ఏడాది పూర్తి కాకుండానే ఐటీఈ అండ్ సీ డిపార్ట్‌మెంట్‌ జాయింట్ సెక్రెటరీగా బదిలీ చేయడం విశేషం.

ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామ‌కృష్ణారావు సంయుక్తంగా బదిలీ చేస్తుండడం శోచనీయమని సచివాలయంలో పలువురు చర్చించుకుంటున్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోరా?

దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇష్టమున్నట్లు బదిలీ చేయకుండా ఉండేందుకు కొన్ని మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. ఒకసారి పదవిలో నియమించిన తరువాత రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదనేది బదిలీలను బట్టి స్పష్టమవుతున్నది. 2011 సంవత్సరంలో పలువురు మాజీ బ్యూరోక్రాట్లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దాఖలు చేసిన వారిలో మాజీ కేబినెట్ సెక్రెటరీ టీఎస్ఆర్ సుబ్రమణియన్, మాజీ సీఈసీ లు టీఎస్.క్రిష్ణమూర్తి, ఎన్.గోపాలస్వామి, మాజీ యూఎస్ అంబాసిడర్ అబిద్ హుస్సేన్, మాజీ ఐపీఎస్ వేద్ ప్రకాశ్ మార్వాహ, మాజీ సీబీఐ డైరెక్టర్ జోగిందర్ సింగ్ తో మొత్తం 77 మంది ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సంతకాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచి జస్టిస్ కేఎస్.పణిక్కర్ రాధాక్రిష్టన్, జస్టిస్ పినాకి చంద్రఘోష్ వాదనలు విన్నది. ఇండియన్ సివిల్ సర్వెంట్ హక్కులకు భంగం వాటిల్లకుండా చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. భారత దేశ సమాఖ్య స్ఫూర్తి కాపాడే విధంగా రాష్ట్రాలలో ఇండియన్ సివిల్ సర్వెంట్ల కు రాజకీయ జోక్యం నుంచి స్వేచ్ఛ లభించేలా నిర్ణయాలు తీసుకున్నది. హోతా కమిషన్ తో పాటు పలు కమిషన్ల సిఫారసులను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చే మౌఖిక ఆదేశాలను అమలు చేసే ముందు వాటిని రాత పుర్వకంగా నమోదు చేయాలని సివిల్ సర్వెంట్లను ఆదేశించింది. బదిలీలు, నియామకాల కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలని తీర్పునిచ్చింది. ఇష్టానుసారంగా రాష్ట్రాలలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ సెక్రెటరీ అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ బోర్డు, రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో సివిల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బోర్డు సిఫారసుల ప్రకారం బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని 2013 సంవత్సరంలో ఆదేశించింది.

బదిలీకి ముందు రోజు 70 ఫైళ్లపై సంతకం

తాజాగా జరిగిన బదిలీల్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సీటు మరింది. బదిలీ జరుగుతుందని ముందస్తు సమాచారం రావడంతో ఒక రోజు ముందుగా ఆయన 70 కీలకమైన ఫైళ్లను హడావుడిగా పరిష్కరించారు. ఈ ఫైళ్లపై సంతకాలు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు సచివాలయంలో గుప్పుమంటున్నాయి. గుజరాత్ కు చెందిన ఒక కాంట్రాక్టర్ కు పనిచేసి పెడతానని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిన సదరు ఐఏఎస్ అధికారి పని చేయకుండా కొన్ని నెలల పాటు ఆయనను తిప్పించుకున్నారని సమాచారం. పని చేయకపోవడం, డబ్బులు ఇవ్వక పోవడంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని సదరు కాంట్రాక్టర్ హెచ్చరించడంతో ఆందోళనకు గురయ్యారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇచ్చిన సొమ్ములో సగం చెల్లించి కాంట్రాక్టర్ ఆగ్రహాన్ని చల్లార్చారంటున్నారు.

Read Also |

మోదీ పాచికలు పారనివ్వని బెంగాల్‌.. అధికారం మళ్లీ తృణమూల్‌దే: పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా
హైద‌రాబాద్ మెట్రో రైల్ తెలంగాణ ప్రభుత్వ పరం.. ఎల్అండ్‌టీతో ఒప్పందం పూర్తి
తెలంగాణ ఉద్యోగుల బకాయిలు రూ.1000కోట్లు విడుదల!
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి