• Telugu News
  • /Trending

Keelback Snakes | దేశంలోకి కొత్త పాములొచ్చాయ్…

భారతదేశ సర్పజాతుల్లో మరో రెండు జాతులు వచ్చి చేరాయి. రాఖైన్‌ కీల్‌బ్యాక్‌, కాచిన్‌హిల్స్‌ కీల్‌బ్యాక్‌ అనే సర్పజాతులు మయన్మార్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈశాన్య ప్రాంతంలో దట్టంగా విస్తరించిన అటవీ ప్రాంతం మయన్మార్‌ వరకూ ఉండటంతో అక్కడి జీవజాతులు ఇటువైపు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

Reported by: Jagan Mohan Talluri | ట్రెండింగ్ | Mar 29, 2026, 6:27 pm IST
Read Time: 6 mins
Keelback Snakes | దేశంలోకి కొత్త పాములొచ్చాయ్…

Keelback Snakes | భారతదేశ జీవ వైవిధ్యం ప్రత్యేకత మరోసారి వెల్లడైంది. దేశంలో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని రెండు రకాల సర్పజాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు అరుదైన కీల్‌బ్యాక్‌ పాములను గుర్తించినట్టు డెహ్రాడూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (Wildlife Institute of India (WII)) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారతీయ సర్పజాతుల్లో మరో జాతి జతచేరినట్టయిందని తెలిపారు. రాఖైన్‌ కీల్‌బ్యాక్‌ అనే సర్పజాతి (Herpetoreas davidi)ని మిజోరంలోని ఎన్‌గెంగ్‌పుయి వైల్డ్‌ లైఫ్‌ సాంక్చురీలో, కాచిన్‌ హిల్స్‌ కీల్‌బ్యాక్‌ (Hebius gilhodesi) అనే సర్పజాతిని నామ్‌డాఫా నేషనల్‌ పార్క్‌, కమ్లాంగ్‌ టైగర్‌ రిజర్వ్‌లో కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఈ రెండు రకాల సర్పజాతులు పొరుగున ఉన్న మయన్మార్‌లోనే ఉంటాయని తెలుసు. తాజాగా వాటి ఉనికి భారతదేశంలోనూ వెలుగు చూసింది.

కొత్త జాతులను కనుగొనడం.. భారతదేశపు ఈశాన్య ప్రాంతం, ఆగ్నేయాసియా మధ్య పర్యావరణ వ్యవస్థ (ecosystem) నిరంతరంగా, అంతరాయం లేకుండా కొనసాగుతున్నది పేర్కొంటున్నదని పరిశోధకులు చెబుతున్నారు. మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దట్టమైన అడవులు అతి భారీ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్‌గా ఉన్నాయి. ఈ అడవులు మైయన్మార్‌ వరకూ విస్తరించి ఉండటంతో రెండు ప్రాంతాల్లోని జీవజాతులు నిరంతరాయంగా స్వేచ్ఛగా కదులుతున్నాయి.

Sea Snakes | భయంకరమైన సముద్ర పాముల గురించి తెలుసా?

ఈశాన్య భారతదేశంలో ఇంకా అన్వేషించని ప్రాంతాలు చాలా ఉన్నాయనేందుకు తాజాగా కనిపించిన సర్పజాతులే నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడి సంక్లిష్టమైన భౌభౌతిక పరిస్థితులు, శాస్త్రీయ సర్వేలకు ఉన్న పరిమితుల కారణంగా ఇంకా అనేక జీవులను డాక్యుమెంట్‌ చేయడం సాధ్యపడటం లేదని పేర్కొంటున్నారు.

కీల్‌బ్యాక్‌ స్నేక్‌ అంటే?

సాధారణంగా కీల్‌బ్యాక్ స్నేక్స్‌ విషరహితాలు. నీటి చెలిమలు, చిత్తడినేలలు, వాగులువంకల వద్ద ఇవి కనిపిస్తూ ఉంటాయి. వాటి ఉనికి ఉందంటే.. ఆ ప్రాంత ఎకోసిస్టమ్‌, ప్రత్యేకించి పరివాహక ఆవాసాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని అర్థం. కీల్‌బ్యాక్‌ స్నేక్స్‌ విలక్షణ ఫీచర్స్‌లో వాటి ఉబ్బెత్తుగా ఉండే పొలుసులు. ప్రతి పొలుసు మీద ఒక గీత ఉంటుంది. దీనితో పాము చర్మం అత్యంత గరుకుగా కనిపిస్తాయి. ఇతర చాలా పాముల్లో మాత్రం పొలుసులు నున్నగా, మెరిసిపోతూ ఉంటాయి. గరుకుగా ఉండే పొలుసులు ఆ పాములు తమను తాము రక్షించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రకృతిలోని ఆకులు, పొదలు, మట్టి వంటివాలిలో సులభంగా ఇమిడిపోతాయి. వాటిపై కాంతి కూడా రిఫ్లెక్ట్‌ కాదు కనుక.. సురక్షితంగా ఉంటాయి. కొత్తగా గుర్తించిన రెండు పాముల జాతులు తేమతో నిండిన ఉష్ణమండల అటవీ ప్రాంతాల్లో నివసిస్తాయని భావిస్తున్నారు. అయితే.. ఆవాసాల నష్టం, పర్యావరణ మార్పుల కారణంగా ఈ ప్రాంతాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

Read Also |

King Cobra Special Videos | స్పెషలైజ్డ్ ప్రెడేటర్.. కింగ్ కోబ్రా లైఫ్ స్టైల్ చూస్తే షాకే
Amazing Facts About Snakes | పాముల గురించి 16 ఆశ్చర్యకర నిజాలు! వీటిలో మీకెన్ని తెలుసు?