NEET UG | ఈ నెల 3వ తేదీన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 73,084 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకు గానూ 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. గతేడాది 72,507 మంది ఈ ఎగ్జామ్‌కు హాజరయ్యారు.
199 పరీక్షా కేంద్రాలన్నీ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలే. ఇందులో ఏ ఒక్కటి కూడా మెడికల్ కాలేజీ లేదు. ఈ పరీక్ష కేవలం పేపర్, పెన్ను పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఇక పరీక్షా కేంద్రాలన్నీ సీసీటీవీ పర్యవేక్షణ నిఘాలో ఉండనున్నాయి. బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జామర్స్‌ను అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.
పరీక్షా కేంద్రాల జిల్లాలు ఇవే..
రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో నీట్ నిర్వహించనున్నారు.
ప్రవేశం ఇలా..
పరీక్ష ప్రారంభానికి మూడు గంటల ముందే పరీక్షా కేంద్రం గేట్లు తెరుస్తారు. అభ్యర్థుల గుర్తింపునకు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్, వీడియోగ్రఫీ వంటి చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుంటే మేలు.
