Samosa in Train | రైలు ప్రయాణాల్లో సమోసాలు, బజ్జీలు, స్నాక్స్ కొనడం చాలామందికి అలవాటు. జర్నీ బోర్ కొట్టకుండా ఏదైనా తినాలనిపిస్తే వెంటనే ప్లాట్‌ఫామ్ లేదా ట్రైన్‌లో తిరిగే వాళ్ల నుంచి కొనేస్తుంటారు. కానీ ఆ ఫుడ్ ఎంతవరకు పరిశుభ్రంగా ఉంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే మాత్రం రైలులో ఏదైనా తినే పదార్థాలను కొనాలనే ఆలోచన వస్తే కచ్చితంగా ఆగిపోవడం ఖాయం.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ సమోసాల విక్రేత కదులుతున్న రైలు కోచ్ తలుపు దగ్గర కూర్చుని మొబైల్‌లో మాట్లాడుతున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ అతను కూర్చున్న విధానమే ఇప్పుడు చర్చకు దారితీసింది. తాపీగా కూర్చున్న అతను కస్టమర్లకు సమోసాలు విక్రయించే ట్రైపైనే కాళ్లు పెట్టి కూర్చున్నాడు. అందులో నిండుగా సమోసాలు కూడా ఉన్నాయి. ఇది గమనించి ఓ రైల్వే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
और खाओ टेस्टी समोसे….😠
कीच़ड तेल और पैर का मैल एक साथ 🤦🤕😠 pic.twitter.com/giBdpcCapO— अर्चना त्यागी–भारतीय किसान संघ 🇮🇳🇮🇳 (@Mrs_Tyagiji) May 26, 2026
‘ఇలాంటి ఫుడ్‌ను మనం తెలియక తింటున్నామా’, ‘ప్రయాణికుల ఆరోగ్యంతో ఇలా ఆడుకోవచ్చా’, ‘ రైలులో ఏమైనా తినుబండారాలు కొనడానికి భయంగా ఉంది’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ‘రుచికరమైన సమోసాలు.. బురద, నూనె, పాదాల మురికి అన్నింటినీ కలిపి తినండి’ అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా స్పందించారు. కస్టమర్ల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో 12809-10 రైలులో విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను పరిశీలించారు. అనంతరం ఆ వీడియో కనిపించిన వ్యక్తి అధికారిక సిబ్బంది కాదని తేలినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. అతను అనధికారికంగా రైలులో తిరుగుతూ విక్రయాలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. రైళ్లలో అనుమతి లేకుండా ఎవరైనా తినుబండారాలను విక్రయిస్తే వెంటనే సమాచారం అందించాలని రైల్వే శాఖ సంబంధిత లైసెన్స్‌దారులకు హెచ్చరికలు జారీ చేశారు.
