Site icon vidhaatha

తిరుమల, యాదాద్రిల్లో భక్తుల రద్దీ

విధాత : తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తిరుమల, యాదగిరిగుట్టలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా అక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. వీరికి శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది.

క్యూ లైన్లలో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఇటు యాదగిరిగుట్టలో సైతం భక్తుల తాకిడి అధికమైంది. క్యూలైన్లలో సాధారణ భక్తులకు లక్ష్మీనరసింహుడి దర్శనం కోసం మూడు గంటల సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి గంట నుంచి గంటన్నర సమయం పట్టింది. భక్తుల రద్దీతో కొండపైన ఆలయ పరిసరాలు, కొండ దిగువన కల్యాణ కట్ట, పుష్కరణిలు కిటకిటలాడాయి.

Exit mobile version