కింగ్ కోబ్రాతో చిన్నారి డ్యాన్స్..వైరల్ వీడియో

కింగ్ కోబ్రా ముందే నిర్భయంగా డ్యాన్స్ చేస్తూ, దానిని ఆటపట్టించిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పాములతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలని వన్యప్రాణుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యంత విషపూరిత పాము జాతికి చెందిన కింగ్ కోబ్రాను చూస్తేనే మనుషులు వణికిపోయి దూరంగా పారిపోతుంటారు. అలాంటిది ఓ చిన్నారి బాలిక కింగ్ కోబ్రాను ఆటపట్టిస్తూ…దానిని కవ్విస్తూ..దాని ముందే భయం లేకుండా డ్యాన్స్ చేయడం విస్మయపరిచింది. ఈశాన్య రాష్ట్రాలలోని ఓ పర్వత ప్రాంతం గ్రామంలో ఓ చిన్నారి బాలిక కింగ్ కోబ్రాతో సయ్యాటలాడిన వీడియో వైరల్ గా మారింది.

తనకంటే పొడవైన భారీ సైజు విష సర్పం కింగ్ కోబ్రా ముందుకు వెళ్లిన ఆ బాలిక, ముందుగా దానిని తట్టి లేపడంతో అది కోపంతో ఆమెపై దాడికి దిగింది. పాము దాడి నుంచి వేగంగా తప్పించుకున్న ఆ చిన్నారి ..నీవు నన్ను పట్టుకోలేవన్నట్లుగా వెక్కిరిస్తూ దాని ముందు నిర్భయంగా డాన్స్ చేసింది. ఆ తర్వాతా ఆ బాలిక పామును తోకవైపుగా పట్టుకుని పైకి ఎత్తడం వీడియోలో కనిపిస్తుంది. చిన్నారి అంతగా కవ్వించినప్పటికి ఆ కోబ్రా మిన్నకుండిపోవడంపై నెటిజన్లు స్పందిస్తూ ఆ చిన్నారి డ్యాన్స్ ఆ పాముకు నచ్చి ఉంటుందని అందుకే ఏమి అనకుండా ఉండిపోయిందని కామెంట్లు పెట్టారు.

మరికొందరు మాత్రం ఆ పాము ఆ చిన్నారి కుటుంబం సంరక్షలోనిదే అయి ఉంటుందని..దానితో ఆట ఆమెకు అలవాటుగా ఉన్నట్లుందని కామెంట్లు చేశారు. ఏది ఏమైనా పాములతో పిల్లల సాహసోపేతమైన చర్యలు అంతమంచివి కావని..ఇలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలని వన్యప్రాణుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest News