Site icon vidhaatha

Congress Govt Vs BRS Govt | రేవంత్‌రెడ్డి బీద అరుపుల‌పై రైతుల ఆగ్ర‌హం! గత సర్కార్‌తో పోల్చుతున్న గ్రామీణులు

హైద‌రాబాద్‌, మే 19 (విధాత‌)
Congress Govt Vs BRS Govt | మాజీ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు క‌న్నా మెరుగ్గా పాలిస్తామ‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ పై రైతులు, గ్రామీణ ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. రైతు భ‌రోసా ఎంత మందికి ఇచ్చారో తెలియ‌దు, ఎందుకు ఆపుతున్నారో తెలియ‌దు. బీమా అంటే ధీమా లేకుండా పోయింది. స‌ర్కార్ ఖ‌జానాలో డబ్బులు లేవ‌ని, న‌న్ను కోసినా పైస‌లు రావ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బీద అరుపులు అరిస్తే అప్పు ఇచ్చేవాడు న‌మ్మ‌డు, ప్ర‌జ‌లు అంత‌క‌న్నా న‌మ్మ‌ర‌ని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. వ‌రి క‌ల్లాల్లో ధాన్యం రాసులు కుప్ప‌లే పాల‌న‌కు సాక్ష్య‌మంటున్నారు. చెప్పిన ప‌థ‌కాల‌ను మాట మార్చ‌కుండా ప‌క్కాగా ఒక‌దాని త‌రువాత మ‌రోటి అమ‌లు చేస్తే రేవంత్ రెడ్డిని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తార‌ని… లేదంటే చాలు చాలు అంటూ సాగ‌నంపుతార‌ని అంటున్నారు.

ర‌చ్చ‌బండ వ‌ద్ద రేవంత్ పాల‌న‌పై చ‌ర్చ‌

గ్రామాల్లో రచ్చ‌బండ‌ ద‌గ్గ‌ర‌, ప్ర‌తి ప‌ది మంది గ్రామీణులు క‌లిసిన చోట తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో మిగ‌తా విష‌యాలు వీరికి అసంద‌ర్భం అయ్యాయి. రైతు భ‌రోసా, రైతు బీమా ప‌థ‌కాలు, రుణ మాఫీ అమ‌లులో నిర్ల‌క్ష్యం, అప్పులు పుట్ట‌డం లేద‌ని రేవంత్ రెడ్డి చేసుకుంటున్న ప్ర‌చారంపై గ్రామీణ జ‌నం స‌మ‌ర్థించ‌డం లేదు. ఒక రాష్ట్రానికి పెద్ద‌గా, య‌జ‌మానిగా వ్య‌వ‌హ‌రించి గుంభ‌నంగా పాల‌న చేయాల్సిన నాయ‌కుడే ఇలా మాట్లాడితే ఉన్న ప‌ర‌ప‌తి, ప‌రువు గంగ‌లో క‌లిసిన‌ట్టేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక కుటుంబంలో పెద్ద ఇంట్లో ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో స‌త‌మ‌తం అవుతున్నా దాని తాలూకు భ‌యాలు త‌న ముఖంలో ఎక్క‌డా క‌న్పించ‌కుండా నెట్టుకుంటూ వ‌స్తాడు. అప్పో స‌ప్పో చేసి కుటుంబాన్ని స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇది త‌ర‌త‌రాల నుంచి వ‌స్తున్న‌దేనని రైతులు చెబుతున్నారు. కుటుంబ పెద్ద మాదిరి తెలంగాణకు ముఖ్య‌మంత్రి పెద్ద మ‌నుసుతో పెద్ద‌రికం చేయాల‌ని సూచిస్తున్నారు. ‘తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌కు ప‌దేళ్లు అధికారం ఇచ్చాం. మాట‌ల గార‌డీ చేసి రెండు ఎన్నిక‌ల్లో ఓట్లేయించుకున్నాడు. అల‌వికాని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేశాడు. ఆ అప్పులు రాష్ట్రానికి గుదిబండ అయ్యాయి. కానీ ఏనాడూ త‌న ఖ‌జానాలో కాసుల గ‌ల‌గ‌ల లేద‌ని వీసుమంత కూడా బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌లేదు. బంగారు తెలంగాణ అని ధీమాతో చెప్పి, ప‌రప‌తిని పెంచారు. ప‌దేండ్ల పాల‌నలో న‌ష్ట‌పోయామ‌ని న‌మ్మి కాంగ్రెస్ ను గెలిపించి పీఠ‌మెక్కిస్తే చేస్తున్న‌దేమిటి?’ అని ఒక రైతు పెద‌వి విరిచారు.

ప్ర‌చారాన్ని న‌మ్మి ఓటేసి మోస‌పోయాం

‘కాంగ్రెస్ నాయ‌కులు గ్రామ‌గ్రామాన కేసీఆర్ పై చేసిన ప్ర‌చారాన్ని న‌మ్మాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించి గెలిపించాం. ఆయ‌న‌క‌న్నా మెరుగ్గా, ఎక్కువ మొత్తంతో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సీజ‌న్ల‌కు రైతు భ‌రోసా వేశారు, ఎంత మందికి వేశారు, ఎన్ని ఎక‌రాల వ‌ర‌కు వేశార‌నేది వ్య‌వ‌సాయ శాఖ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించడం లేదు. మూడున్న‌ర ఎక‌రాల‌కు మించి రైతు భ‌రోసా వేయ‌లేదు’ అని మరో రైతు అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంలో రైతు బంధు వేస్తున్నారంటే ఒక న‌మ్మ‌కం ఉండేద‌ని, ఇప్పుడా న‌మ్మ‌కం భ‌రోసా లేకుండా పోయింద‌ని రైతులు నిట్టూర్చుతున్నారు. ఇక బీమా విష‌యానికి వ‌స్తే అమ‌లు కావ‌డం లేద‌ని ఎత్తిపోడుస్తున్నారు. చ‌నిపోయిన వారికి రూ.5 ల‌క్ష‌లు చెల్లిస్తామ‌ని చెప్పి, అమ‌లు చేయ‌కుండా కొర్రీలు వేస్తున్నారు.

ధాన్యపు రాసులే పాలనకు సాక్ష్యాలు

గ్రామాల్లో ధాన్యం రాసులు కుప్ప‌లు కుప్ప‌లుగా ఉన్నాయ‌ని, అకాల వ‌ర్షాల‌కు త‌డిసిపోయి న‌ష్ట‌పోతున్నామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ హ‌యాంలో క‌ల్లాలు అయిన త‌రువాత ధాన్యం రాసులు క‌న్పించేవి కావ‌ని, ఇప్పుడా స్పీడ్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో లేదంటున్నారు. ధాన్యం కోత‌కు వ‌చ్చే స‌మ‌యంలో వ‌డ్లు క‌ల్లాల్లో క‌న్పించ‌వ‌ద్ద‌ని, బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం పెట్టి ప్ర‌భుత్వం నుంచి కౌంటర్ గ్యారంటీ ఇచ్చేవాడు. దీంతో పౌర స‌ర‌ఫ‌రాల ధాన్యం సేక‌రించి మిల్ల‌ర్ల‌కు పంపించేదని గుర్తు చేసుకుంటున్నారు. రుణ మాఫీలో లేనిపోని నిబంధ‌న‌లు పెట్టి, కొంద‌రికే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. అర్హుల‌కు మొండి చేయి చూపి అన‌ర్హుల‌కు మాఫీ చేయ‌డాన్ని రైతులు ఏమాత్రం అంగీక‌రించ‌డం లేదు. ఇలా ఏ ప‌థ‌కాన్ని కూడా పూర్తి చేయ‌కుండా మొద‌లు పెట్టి అసంపూర్తిగా వ‌దిలేయ‌డం స‌రైంది కాద‌ని రైతులు బ‌హిరంగంగా మండిప‌డుతున్నారు. ఒక ప‌థ‌కాన్ని సంపూర్ణంగా అమ‌లు చేసిన త‌రువాత మ‌రో ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని సూచిస్తున్నారు.

సీఎం, మంత్రులు, అధికారుల మ‌ధ్య స‌మన్వయం సున్నా

కాళేశ్వ‌రం ప్రాజెక్టు నీళ్లు లేకుండానే పంట‌ల దిగుబ‌డి వ‌చ్చింద‌ని, ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ ఒక ల‌క్ష కోట్లు నీళ్ల పాలు చేశార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. గ‌త స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఏమాత్రం త‌ప్పు లేదు. కాని మీరు చేస్తుందేమిటి అని రైతులు నిల‌దీస్తున్నారు. గతంలో వ‌రి క‌ల్లాల్లో వ‌డ్ల గింజ క‌న‌ప‌డ‌కుండా వెంట‌వెంట‌నే కొనుగోళ్లు చేయించేవారని, ఇప్పుడు ఎందుకు జ‌ర‌గ‌డం లేద‌ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు చేసిన అధికారులే ఈ ప్ర‌భుత్వంలోనూ ఉన్నారు. లోపం ఎక్క‌డ ఉంద‌నే ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు. ముఖ్య‌మంత్రి, మంత్రుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. ముఖ్య‌మంత్రి ఇంటి నుంచి లేదా పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి సమీక్షలు చేస్తున్నారు.. మంత్రులు స‌చివాల‌యానికి వ‌చ్చిపోతున్నారు. ఏది ఏమైనా ముఖ్య‌మంత్రి, మంత్రులు, శాఖాధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌నే దానికి గ్రామాల్లో ధాన్యం రాసుల కుప్ప‌లే నిద‌ర్శ‌న‌మ‌ని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Bhu Bharathi | నిజాం కాలంనాటి నక్షాలకు మోక్షం.. వచ్చే వారం నుంచే ప్రయోగాత్మకంగా రీసర్వే
King Cobra | ఈ పామును చూస్తే.. మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు!
Gulzar House fire accident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి అసలు కారణమిదే..
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. తక్కువ ధరకే సిమెంట్, స్టీల్

Exit mobile version