SC categorization : తెలంగాణ‌లో ఎస్సీ వర్గీకరణతో టార్గెట్ బీజేపీ!

ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తాము అమలు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అమలు చేయాలని కడియం డిమాండ్ చేయడం గమనార్హం. దీంతోపాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలని లేవనెత్తడం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి టార్గెట్ విధించడమే. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నందున బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ కారణంగా ఆయన కూడా ఇరుకునబడే అవకాశం ఉంది.

SC categorization : తెలంగాణ‌లో ఎస్సీ వర్గీకరణతో టార్గెట్ బీజేపీ!
  • దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయాల్సిన ప‌రిస్థితికి కేంద్రం
  • ఒత్తిడి పెంచేలా కాంగ్రెస్ ప‌క్కా వ్యూహం
  • బీజేపీ రాజకీయానికి రేవంత్ తరహా కౌంటర్
  • ఇర‌కాట ప‌రిస్థితిలోకి కృష్ణ మాదిగ

(విధాత ప్రత్యేక ప్రతినిధి)
SC categorization : ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొచ్చి, చట్టబద్ధత కల్పించింది. మాదిగల సుదీర్ఘ పోరాటం, వర్గీకరణ స్వప్నం అమలుకు అందరికన్నా వేగంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగింది. ఈ క్రమంలోనే మంగళవారం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసింది.

బీజేపీ రాజకీయానికి రేవంత్ కౌంటర్
ఒకవైపు ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటూనే… కేంద్రప్రభుత్వంపైన, బీజేపీ మీద ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా మందకృష్ణ మాదిగ కొనసాగుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వినియోగించుకొని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా పావులు కదిపిన విషయం బహిరంగమే. మాదిగల ఓట్లు పొందేందుకు బీజేపీ ఈ ఎత్తుగడను అనుసరించింది. గత ఎన్నికల్లో మందకృష్ణ మాదిగకు ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించి ఎన్నికల ప్రచారంలో వినియోగించుకున్నారు. ఈ ప్లాన్‌తో మాదిగల ఓట్లను బీజేపీ వైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయా? లేదా ? అనే అంశాన్ని పక్కకు పెడితే బీజేపీకి మాదిగలు మద్దతు నందించాలని కృష్ణ మాదిగ బహిరంగంగా పిలుపునివ్వడం అంబేద్కర్ వాదుల్లో తీవ్ర కలకలం సృష్టించింది. మనువాదులకు కృష్ణ మాదిగ దాసోహం అయ్యారనే విమర్శలు వచ్చాయి.

పావులు కదిపిన రేవంత్ సర్కార్
బీజేపీ, కృష్ణ మాదిగ మధ్య‌ నెలకొన్న బంధం తదితర మొత్తం రాజకీయ ఎపిసోడ్‌ను గ్రహించిన రాష్ట్ర కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీపైన‌, కేంద్ర ప్రభుత్వంపైన‌ ఒత్తిడి తెచ్చే విధంగా పావులు కదిపింది. బీజేపీ, దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కృష్ణ మాదిగకు కౌంటర్‌గా తమదైన పద్ధతిలో ఎత్తుగడను అమలు చేసిందనే చర్చ తాజాగా సాగుతున్న‌ది. దీనికి అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీనియర్ నేత కడియం శ్రీహరి లేవనెత్తిన, డిమాండ్ చేసిన పలు అంశాలు అత్యంత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తాము అమలు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అమలు చేయాలని కడియం డిమాండ్ చేయడం గమనార్హం. దీంతోపాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలని లేవనెత్తడం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి టార్గెట్ విధించడమే. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నందున బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ కారణంగా ఆయన కూడా ఇరుకునబడే అవకాశం ఉంది. అనివార్యంగా వర్గీకరణను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర సర్వీసుల్లో అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయాల్సిన అనివార్యతను కృష్ణ మాదిగకు కాంగ్రెస్ సృష్టించిందని భావిస్తున్నారు. ఈ కారణంగానే తొలి నుంచి వర్గీకరణ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న మాదిగ ఉపకుల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి నోట ఈ విషయాలు వెలువడే విధంగా ప్రణాళిక రచించారని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కడియం డిమాండ్ పైన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, మందకృష్ణ మాదిగ ఏవిధంగా స్పందిస్తారనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో, ఎస్సీ సామాజిక వర్గంలో ప్రారంభమైంది.

అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎస్సీ వర్గీకరణను కేంద్ర సర్వీస్‌లలో అమలు చేయాలని ఆ దిశగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో వర్గీకరణ అంశంపై కడియం అసెంబ్లీలో ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును వెంటనే దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర సర్వీసుల‌లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, ఆ దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల జీవితాలలో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన షెడ్యూల్ కూలాల రిజర్వేషన్ 18శాతనికి పెంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. దళిత సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలబడుతుందని వెల్లడించారు.