Jubilee Hills Bypoll Close Contest | పై‘చేయే’నా? ‘కారు’ దూసుకెళ్లేనా?.. ఉప ఎన్నిక కోసం జూబ్లీహిల్స్ ఓటర్ రెడీ

ప్రచారాలు ముందే ముగిశాయి.. పంపిణీలు కూడా తాజాగా ముగిశాయంటున్నారు. మొత్తానికి జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనన్న చర్చలూ ఊపందుకున్నాయి.

Jubilee Hills bypoll

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Jubilee Hills Bypoll Close Contest | జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రచారం పూర్తి చేసి, పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ప్రచారం చేయకూడని సమయంలో తాయిలాల తతంగం పూర్తి చేశాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళవారం (11, నవంబర్‌ 2025) ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్దిష్ట సమయంలో పోలింగ్ ప్రక్రియ పూర్తికానున్నది. రెండు ప్రధాన పార్టీలు తమ బస్తీ నాయకులు, కాలనీ పెద్దల ద్వారా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేయగా, మరో పార్టీ ఆన్ లైన్ లో పంపిస్తున్నట్లు ఓటర్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని ప్రాంతాలలో పంపిణీ పూర్తి చేసిందని అంటున్నారు. ఒక్కో ఓటరుకు రూ.2,500 చొప్పున ఇచ్చినట్లు బస్తీ ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా రూ.2,500 చొప్పున ఇచ్చిందంటున్నారు. అయితే తమకు బలం ఉన్న ప్రాంతాలలోనే ఈ తతంగం పూర్తి చేశారంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న బస్తీల్లో ఇవ్వలేదని సమాచారం. బీజేపీ మాత్రం పంపిణీ లో కొత్త విధానం అమలు చేసిందంటున్నారు. డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నదని తెలుస్తున్నది. బస్తీ నాయకుల ద్వారా మొబైల్ నెంబర్లు సేకరించి, ఆన్‌లైన్‌లోనే పూర్తి చేశారని సమాచారం. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ఉందంటున్నారు.

నెల రోజులుగా హోరా హోరీ ప్రచారం

ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గత నెల రోజులుగా హోరా హోరీగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు రెండు వారాలుగా పెద్ద ఎత్తున వాడ వాడలా ప్రచారం ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. గత మూడు దఫాలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లో మాత్రం హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ను గెలిపిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కాలనీలు, బస్తీలు, కమ్యూనిటీ మీటింగ్ లు, పార్కులు, ఫంక్షన్ హాళ్లలో సమావేశాలు నిర్వహించారు. కార్నర్ మీటింగ్ లు, జంక్షన్ మీటింగ్ లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గం వెనకబడి పోయిందని, ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వీ.నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు అని పరిచయం చేశారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని, రెండు పార్టీల మధ్యనున్న బంధం వివరించే ప్రయత్నం చేశారు. ముస్లిం ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు వీలుగా క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన కూడా తనవంతుగా కాలనీలు, బస్తీలు తిరిగి ప్రచారం చేశారు.

అన్నీ తానై.. కేటీఆర్‌

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై ప్రచారం చేశారు. రెండు నెలలుగా డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించారు. నెల రోజులుగా మైక్రో లెవెల్ ప్రచారం చేస్తూ ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే హైడ్రా కూల్చివేతలు జరుగుతాయని, ఆపాలంటే ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో మాగంటి గోపీనాథ్‌ను గెలిపించినట్టే.. ఈసారి ఆయన భార్య సునీతకు పట్టం కట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయాలన్నా, హామీలు అమలు కావాలన్నా.. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లను కోరారు.

బీజేపీ పక్షాన కేంద్ర మంత్రులు

బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం కేంద్ర మంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్ర రావు, ఎంపీలు ఈటల రాజేందర్, మాధవరం రఘునందన్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా పర్యటించారు. అయితే కేంద్రం నుంచి ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొనలేదు. గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి రాలేదు. ఆయన పూర్తిగా ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు.

నువ్వా నేనా అన్నట్టు ప్రచారం

నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలైన నవీన్ యాదవ్ పై బస్తీ ప్రజలు, ముస్లిం ఓటర్లలో సానుభూతి ఉంది. ఆ సానుభూతి ఓటు రూపంలో మద్ధతు ఇచ్చి దీవిస్తారా లేదా అనేది మంగళవారం నాటి ఓటింగ్ లో తెలియనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం, బస్తీ ప్రజలు, ముస్లిం ఓటర్లను నమ్ముకుని ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన భర్త గోపినాథ్ మూడు పర్యాయాలు నియోజకవర్గంలో చేసిన సేవలపై ఆశలు పెట్టుకున్నారు. గోపినాథ్ మాదిరే ముస్లిం ఓటర్లకు అందుబాటులో ఉంటానని, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తన ఇంటికి నేరుగా వచ్చి చేయించుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. సునీత తో పాటు ఆమె కుమారుడు, ఇద్దరు కుమారులు కాలనీలు, బస్తీల్లో కలియతిరిగారు. ప్రజలను రెండు విడతల్లో కలిసి మద్ధతు పలకాల్సిందిగా కోరారు. గోపినాథ్ మొదటి భార్య, కుమారుడు, తల్లి ఎంతగా రెచ్చగొట్టినా, సునీత ఎక్కడ కూడా నోరు జార లేదు. సోషల్ మీడియాలో ఎంతగా దూషించినా, బదనాం చేసినా సంయమనం పాటించారు.