Vattinagulapally Land Grab Row | తెలంగాణ నంబర్‌ టూ మంత్రి కుమారుడి భూ కబ్జా కత!

ఆయన తెలంగాణ మంత్రివర్గంలో నెంబర్‌ టూ స్థానంలో ఉంటారనేది రాజకీయవర్గాల్లో చర్చ! ఆయన కుమారుడు హైదరాబాద్‌ వట్టినాగులపల్లిలో మూడెకరాల భూమిలోకి రావడం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నది.

hyderabad land grab row story

హైద‌రాబాద్‌, విధాత‌ ప్రతినిధి:

Vattinagulapally Land Grab Row | ఆయ‌న ఒక చిన్న కాంట్రాక్ట‌ర్‌గా జీవితం ప్రారంభించారు. ఆ త‌రువాత ఏపీలో ముఖ్య‌ నేత‌తో ఆర్థిక సంబంధాలు పెరిగాయి. ఇంకేముంది ఆయ‌న త‌న‌ ప‌లుకుబ‌డిని విస్త‌రించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌రువాత ఒక రాజ‌కీయ పార్టీలో చేరి ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నిక‌య్యారు. ఆంధ్రా పార్టీ కావడంతో ప్ర‌త్యేక రాష్ట్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంబంధాలు దెబ్బ‌తిని, ఆ పార్టీ అధినేత ద‌గ్గ‌రికి రానివ్వ‌క‌పోవ‌డంతో విధిలేని ప‌రిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌ జాతీయ పార్టీలో చేరి చ‌క్రం తిప్ప‌డం మొద‌లు పెట్టారు. ఒక జిల్లాను ద‌త్త‌త తీసుకోవ‌డమే కాకుండా చుట్టు ప‌క్క‌ల మ‌రికొంద‌రిని గెలిపించేందుకు పెద్ద ఎత్తున‌ ఆర్థిక సాయం అందించారన్న గుసగుసలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. పార్టీ అధికారంలోకి రావ‌డం, కీల‌కమైన శాఖ‌లు అప్పగించ‌డంతో ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటూ ఆర్థికంగా మ‌రింత బ‌ల‌ప‌డుతున్నారు. ఇప్పుడు క్యాబినెట్‌లో ‘నంబ‌ర్ టూ’ మంత్రిగా గుర్తింపు పొందారు. ఆ అమాత్యుడి పుత్ర ర‌త్నం న‌గ‌ర శివారులో విలువైన భూమిపై క‌న్నేసి చెర‌బ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఏకంగా త‌న వెంట బౌన్స‌ర్లు, కూలీలు, జేసీబీలు, రాతి క‌డీలు, ఇనుప జాలీలు తీసుకువెళ్ళి ప్రి–కాస్ట్‌ ప్ర‌హ‌రీ గోడ కూల్చివేయించాడు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 70 మంది బౌన్స‌ర్ల‌తో వెళ్లడంతో భీతిల్లిన భూమి య‌జ‌మాని స‌తీష్ షా, ప‌ల్ల‌వి షా.. సైబ‌రాబాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా త‌న భూమిలోకి అక్ర‌మంగా కొంద‌రు ప్ర‌వేశించారంటూ ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని బౌన్స‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఉత్త‌ర్వులు ఉండటంతో సైబరాబాద్ ఉన్న‌తాధికారి స్వ‌యంగా రంగంలోకి దిగి బౌన్స‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారంటున్నారు. అమాత్యుడి పుత్ర‌ర‌త్నం పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు కావాల్సి ఉండ‌గా పై స్థాయి ఒత్తిడితో సాధార‌ణ కేసు ల‌ను ఇరు ప‌క్షాల‌పై న‌మోదు చేశారని తెలుస్తున్నది.

వాచ్‌మెన్‌ ఊష‌య్య క‌థ‌నం ప్ర‌కారం.. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం వ‌ట్టినాగులప‌ల్లిలో స‌ర్వే నంబ‌ర్ 245 లో ప‌ల్లవి షా, స‌తీష్ షా దంప‌తుల‌కు మొత్తం 20 ఎక‌రాల వ‌ర‌కు భూమి ఉన్న‌ది. ఇర‌వై ఏళ్ల క్రితం మండ‌ల‌ స‌ర్వేయ‌ర్లు స‌ర్వే చేసి హ‌ద్దులు నిర్ణ‌యించారు. ఆ భూమి ప‌క్క‌నే సునీల్, అవినాశ్ షా కు భూమి ఉంది. ఆయ‌న వేరే వాళ్ల‌కు (మంత్రి కుమారుడి క‌న్‌స్ట్రక్షన్‌ కంపెనీ) విక్ర‌యించారు. తమ య‌జ‌మాని ఒక్క ఎక‌రా కూడా విక్ర‌యించకుండా త‌న భూమిని కాపాడుతూ వ‌స్తున్నారని వాచ్‌మెన్‌ చెబుతున్నాడు. ఈ భూమి య‌జ‌మానికి ప్రియాంకా షా, రాధికా షా అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. శ‌నివారం సునీల్‌, అవినాశ్‌లతో పాటు భూమిని కొనుగోలు చేసిన వాళ్ళు దౌర్జ‌న్యంగా తమ య‌జ‌మాని భూమిలోకి ప్ర‌వేశించి క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించారని, త‌మకు చెందిన మూడెక‌రాల భూమి ఉందంటూ బెదిరింపుల‌కు దిగారని వాచ్‌మెన్‌ చెప్పాడు. ఈ విష‌యాన్ని వెంట‌నే య‌జ‌మాని అవినాశ్ షా కు ఫోన్ లో తెలియ‌చేయ‌గా, వెంట‌నే త‌న భార్య ప‌ల్ల‌వి షా తో క‌లిసి ఘ‌ట‌నా ప్రాంతానికి వచ్చారు. వారిపైనా దౌర్జ‌న్యానికి దిగారు. ‘అందరూ బ‌య‌ట‌కు ప‌రుగెత్త‌గా, సెక్యురిటీతో పాటు జీత‌గాడిని చిత‌క్కొట్టారు. 50 మంది బౌన్స‌ర్లు, వంద మంది కూలీల‌తో వ‌చ్చి ప్ర‌హ‌రీ కూల్చివేసి, పునాదులు త‌వ్వారు. ఆవుల‌ను వెళ్ల‌గొట్టారు, లైట్లు తీసివేశారు, ఫ‌ర్నీచ‌ర్ విర‌గ్గొట్టారు. మూడు జేసీబీలు, ఒక డీసీఎం, రాతి క‌డీలు, ఇనుప జాలీల‌తో వ‌చ్చారు. పోలీసుల‌కు ఫోన్ చేయ‌గా, వాళ్లు వ‌చ్చే లోపు ప్ర‌హ‌రీ కూల్చివేసి రాతి క‌డీలు పాతారు. పోలీసులు రావ‌డంతో కొంద‌రు పారిపోగా, మ‌రికొంద‌రు ఉన్నారు. పోలీసులు రావ‌డంతో ధైర్యం చేసి మా య‌జ‌మాని భ‌యం భ‌యంగా లోప‌లికి వ‌చ్చారు. క‌బ్జా చేసేందుకు వ‌చ్చిన ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించాడు.

ఎఫ్ఐఆర్ ఎక్క‌డ‌?

ఇరుపక్షాల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన గ‌చ్చిబౌలి పోలీసులు ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తున్న‌ది. సాధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన త‌రువాత వివ‌రాల‌ను వెల్ల‌డిస్తుంటారు. తెలంగాణ పోలీసు వెబ్ పోర్టల్‌ ద్వారా వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. కానీ.. నంబ‌ర్ టూ మంత్రి, ఆయ‌న పుత్ర‌ర‌త్నం కేసు కావ‌డంతో పై నుంచి ఒత్తిళ్ళు వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. తొలుత అవినాశ్‌ షా తో పాటు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అవినాశ్ ఫిర్యాదు మేర‌కు స‌తీశ్‌ షా, ఆయ‌న భార్య పై కేసు న‌మోదు అయ్యింది.

ఇదీ భూమి నేప‌థ్యం

వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో ప‌లు స‌ర్వే నంబ‌ర్ల‌లో సుమారు 120 ఎక‌రాల భూమి ఉంది. ఈ 120 ఎక‌రాల‌ భూమిపై హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన ఉత్త‌రాదికి చెందిన‌ 12 కుటుంబాల‌కు హ‌క్కులు ఉన్నాయి. ఇందులో నుంచి గ‌తంలో 8 ఎక‌రాల భూమి ఔట‌ర్ రింగ్ రోడ్డు కోసం సేక‌రించారు. సేక‌రించిన త‌రువాత మిగ‌తా భూమిని 12 కుటుంబాలు విభ‌జించుకుని, ఎవ‌రికి వారుగా స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించుకున్నారు. ప‌ల్లవి షా, స‌తీష్ షా దంప‌తుల‌కు 20 ఎక‌రాలు (స‌ర్వే నంబ‌ర్ 245) ఉంది. దానికి ఆనుకుని అవినాశ్ షా, సునీల్ షా ల‌కు కూడా భూమి ఉంది. అవినాశ్ షా, సునీల్ షా (స‌ర్వే నెంబ‌ర్ 259) లు త‌మ భూమిని మంత్రి కుమారుడి కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని సమాచారం. రికార్డుల్లో భూమి ఉన్న‌ప్ప‌టికీ, భౌతికంగా లేక‌పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న స‌తీష్ షా భూమిలోకి అక్ర‌మంగా ప్రవేశించి కూల్చివేయ‌డంతో గొడ‌వ మొద‌లైంది. అయితే మొత్తం 120 ఎక‌రాల్లో మూడెక‌రాలు త‌క్కువ‌గా ఉండ‌డంతో వివాదాస్ప‌దంగా మారిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Mushroom Business | ఆ దంప‌తుల జీవితాన్ని మార్చేసిన పుట్ట‌గొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 24 ల‌క్ష‌ల సంపాద‌న‌..!
football world record| అత్యంత ఎత్తులో ఫుట్ బాల్ ఆట..వరల్డ్ రికార్డు
Samantha -Raj | సమంత- రాజ్ నిడిమోరు వివాహం త‌ర్వాత ఆస్తుల‌పై చ‌ర్చ‌లు .. ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎక్కువ‌?
Sanchar Saathi App | మొబైల్‌లో సంచార్ సాథీ డిఫాల్ట్‌ యాప్.. యూజర్ల అన్ని కమ్యూనికేషన్లు ప్రభుత్వం చేతిలో?

Latest News