Reservations Constitutional Debate | రిజర్వేషన్లపై పరిమితి లేదు!.. 50 శాతం మించొద్దని రాజ్యాంగంలో లేదు

రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా? చట్టం ఏం చెబుతోంది? రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగం ఏమంటున్నది? బీసీ మంత్రులు, బీసీ ముఖ్యమంత్రులు, బీసీ ప్రధాన మంత్రితో బీసీలకు న్యాయం జరుగుతుందా? న్యాయం చేయాల్సిన కోర్టుల్లో న్యాయం ఉన్నదా? మండల్‌ కమిషన్‌ చుట్టూ రాజకీయాలేంటి? రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడానికి అసలు కారణమేంటి? ఈబీసీ రిజర్వేషన్ల కథేంటి? ఇలా అనేక అంశాలపై నిజాం కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్‌ సుదర్శన్ ‘విధాత’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ..

Reservations Constitutional Debate | హైదరాబాద్, ఆగస్ట్‌ 09 (విధాత) : రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ల అంశం తెరమీదకి వచ్చినా అంతిమంగా ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నిజాం కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్ వ్యాఖ్యానించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవకూడదంటూ కోర్టులు చెబుతున్నాయన్న సుదర్శన్‌.. ఈ విషయంపై రాజ్యాంగంలో ఎక్కడా ఒక్క ప్రొవిజన్‌, ఆర్టికల్ లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం కోర్టుల వ్యక్తిగత అభిప్రాయమేనని తేల్చి చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా నిర్ణయాలు తీసుకునేముందు ఆ పార్టీ భావజాలంతోపాటు ఆ సందర్భంలో ఉండే రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని విధాత యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. 1977లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనతా పార్టీ అప్పటి ఎన్నికలకు ముందు బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పై విధానాలను అధ్యయనం చేసి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీనిచ్చిందని ప్రొఫెసర్‌ సుదర్శన్‌ గుర్తు చేశారు. మొదటిసారి రిజర్వేషన్లపై మండల్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. అంతకుముందున్న మొదటి ఓబీసీ కమిషన్ కాకా కాలేర్కర్‌ కమిషన్‌ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జనతా పార్టీ గెలిచిన తరువాత.. ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనైక్యత కారణంగా కుప్పకూలిపోయిందన్నారు. ఆ తరువాత ఏర్పాటైన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి మండల్ కమిషన్ తన రిపోర్టును అందించిందన్నారు. అయితే, ఆ రిపోర్టును ఇందిరాగాంధీ పక్కనపెట్టిందని తెలిపారు.

10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా అమలు చేశారు?

మండల్ కమిషన్ వెనుకబడిన కులాలను కాకుండా.. వెనుకబడిన తరగతులను అధ్యయనం చేసిందని ప్రొఫెసర్‌ సుదర్శన్‌ తెలిపారు. ఈ క్రమంలో వచ్చిన ఓబీసీ అనే పదంలో ఆర్థిక స్థితులను తక్కువగా ప్రస్తావిస్తూ.. సామాజికంగా వెనుకబడిన విషయాన్ని ప్రధానంగా తీసుకుని.. వారిని ఓబీసీ వర్గంలో చేర్చడానికి అర్హత ఉందా? లేదా? అనేది పరిశీలించి కొన్ని వేల కులాలను గుర్తించిందని వివరించారు. కానీ, ఇందిరాగాంధీ దీనిని అమలు చేయడానికి మొగ్గు చూపలేదన్నారు. ఆధిపత్య, దళిత, ఆదివాసీల గ్రూపుగా ఉన్న కాంగ్రెస్ ఓబీసీలను పట్టించుకోలేదన్నారు. ఆ తరువాత మండల్ కమిషన్ రిపోర్టును అమలు పరచడానికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ ఆర్డినెన్స్ తెచ్చే క్రమంలో 1989లో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకపోరాట సమితి ఏర్పాటు చేసి రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తుచేశారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం ప్రధానం అంటూ ఈ అంశాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు 42శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగం ఒప్పుకోదంటున్నారని.. మరి 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా అమలు చేశారని ప్రొఫెసర్ సుదర్శన్ ప్రశ్నించారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పదిశాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు కాగానే ఓబీసీ సంఘాలు కేసు వేశాయన్నారు. దీంతో సుప్రీంకోర్టు అంతిమంగా ఇచ్చిన తీర్పులో రెండు ప్రధానాంశాలున్నాయన్నారు. అందులో ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగం అంగీకారం కాదని.. అలాగే 60శాతం ఉన్న రిజర్వేషన్ల పరిమితికి మించి ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

రాజకీయ పరిణామాలతో రిజర్వేషన్ల పరిమితి ఆధారం!

కొన్ని రాష్ట్రాల్లో 27శాతానికి మించి బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని సుదర్శన్‌ గుర్తు చేశారు. అందులో ఏపీలో 29, బీహార్ 33, కర్ణాటకలో 32, కేరళలో 40, తమిళనాడులో 50, అండమాన్ నికోబార్‌లో 38, పాండిచ్చేరిలో 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని వివరించారు. అయితే, మండల్ కమిషన్ అమలులోకి రావడానికి ముందే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థానిక ప్రభుత్వంలో 33శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 50 శాతానికి మించి రిజర్వేరేషన్లు దాటిపోయాయని.. ఏదో ఒక కారణం చేత వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పరిమితిని దాటిపోయాయని వివరించారు. 1994లో రాష్ట్రపతి ఆమోదంలో తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని.. దీనికి కారణం రాజకీయ పరిణామాలపై ఆధారపడిందన్నారు. ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేసుకుని రిజర్వేషన్ల పరిమితిని పెంచుకున్నారని గుర్తుచేశారు. అయితే, తెలంగాణలో విద్య, ఉద్యోగ, స్థానిక ప్రభుత్వాల్లో అమలు పరచడానికి 42శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని వెల్లడించారు.

50శాతానికి మించకూడదని రాజ్యాంగంలో లేదు

ఈ రిజర్వేషన్ల ఘర్షణలు కారణంగా రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన వనరులు పంచుకునే స్థితి వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ సుదర్శన్ అంచనావేశారు. అలాగే, రిజర్వేషన్లు కేటాయించడానికి ప్రతిభ అవసరం లేదని.. కేవలం సామాజిక న్యాయంకోసం అమలు కావాలని అభిప్రాయపడ్డారు. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవకూడదంటూ కోర్టులు చెబుతున్నాయన్నారు. అయితే, ఈ విషయంపై రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక ప్రొవిజన్‌, ఆర్టికల్ లేదని, ఇది కేవలం కోర్టుల వ్యక్తిగత అభిప్రాయమేనని స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతున్నా న్యాయవ్యవస్థలో మాత్రం అది కావడం లేదని ఆరోపించారు. న్యాయవ్యవస్థ కూడా బ్రాహ్మణికల్ మైండ్ సెట్‌తో పనిచేస్తున్నదని విమర్శించారు. దీని వల్ల రాజ్యాంగంలోని అంశాలను కోర్టులు పట్టించుకోవడం లేదని స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.

ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచడాన్ని బీజేపీ అడ్డుకుంటుంది

‘తెలంగాణలోని బీజేపీ నాయకులు బీసీలకు తమ పార్టీతోనే న్యాయం జరుతుందంటున్నారు. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెబుతున్నారు. కానీ, బీసీ ప్రధాని అయినా కూడా బీసీలకు బీజేపీ ఏం చేయలేదు. బీసీ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది’ అని ప్రొఫెసర్ సుదర్శన్ ప్రశ్నించారు. బీజేపీ ఓబీసీలను మతప్రాతిపదికగా చూస్తుంది తప్ప.. సామాజిక ప్రతిపదికగా చూడదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి బీజేపీ పూర్తి వ్యతిరేకమన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీజేపీ ప్రభుత్వం పాలనకొనసాగిస్తుందన్నారు. బీజేపీ నాయకులు, నేతలు భారత రాజ్యాంగాన్ని పట్టించుకోరని వ్యాఖ్యానించారు. ఓబీసీ రిజర్వేషన్లు కులప్రాతిపాదికన కాదు.. సామాజికంగా వెనుకబడిన తరగతులకిచ్చేదిగా చూడాలని సూచించారు. బీజేపీ తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఆర్థికంగా వెనుకబడిన వారిలో ముస్లింలను ఎందుకు చేర్చలేదని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో దేశవ్యాప్తంగా ఎన్జీవో లెక్కల ప్రకారం 90శాతం మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. తెలంగాణనే కాకుండా భారతదేశం మొత్తంలో ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి బీజేపీ వందశాతం అడ్డుకుంటుందని ప్రొఫెసర్ సుదర్శన్ తేల్చిచెప్పారు. అవసరమైతే ప్రభుత్వం పోయినా సరే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకాకుండా చేస్తుందని అంచనావేశారు. గ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులపై, ఎంపీలపై, కేంద్రమంత్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని సూచించారు. దీంతోపాటు ఈ అంశంపై పార్లమెంట్ లో మాట్లాడేలా టీ.కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలన్న అవసరం ఉందన్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమం ఎలా నడిచిందో బీసీలంతా 42శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడానికి ముందుకు రావాలని సుదర్శన్ పిలుపునిచ్చారు. రిజర్పేషన్ల సాధనకోసం కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి.. ఈ అంశంపై గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. దీనివల్ల బీసీలకు ఎంత ఉపయోగం జరుగుతుందో కాంగ్రెస్ కు అంతే ఉపయోగం జరుగుతుందని ప్రొఫెసర్ సుదర్శన్ వివరించారు.

ఇవి కూడా చదవండి..

ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణకు రూట్ మ్యాప్: మంత్రి ఉత్తమ్
Padmanabhaswamy Temple | పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరుస్తారా!