Site icon vidhaatha

Kaleshwaram Commission | ‘కాళేశ్వరం’పై దాగుడు మూతలు.. ఫైళ్లు ఇవ్వడానికి కమిటీ ఎందుకు?

Kaleshwaram Commission | కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ) కు సంబంధించిన అన్ని రకాల ఫైళ్లను పంపించాలని కాళేశ్వరం జ్యూడీషీయల్ కమిషన్ గత కొన్ని నెలలుగా లేఖలు రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఎట్టకేలకు ఈ నెల 30వ తేదీలోపు కాళేశ్వరం ఫైళ్లు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడమే కాకుండా ఆ మేరకు సోమవారం మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ ఫైళ్ల అప్పగింత బాధ్యతను ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే.రామ‌కృష్ణారావుకు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు, అక్రమాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌.. పద్నాలుగు నెలలుగా ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ఇంజినీర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించింది. ఈ నెల మొదటి వారంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును విచారించింది. ఈ ముగ్గురూ తమ విచారణలో మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం మేరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించామని చెప్పారు. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన ఈ మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడు, ప్రస్తుతం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఉలిక్కిపడ్డారు. అసలు మంత్రివర్గ ఉప సంఘంలో ఈ అంశమే లేదని, తను ఆమోదం తెలపలేదని మీడియా సమావేశం పెట్టి జీవోలతో సహా బహిర్గతం చేశారు. తనపై బురద జల్లుతున్నారంటూ ఆయన కాళేశ్వరం కమిషన్ కు వివరాలు పంపిస్తున్నానంటూ తెలిపారు. తుమ్మల ప్రకటనతో అసలు కథ మైదలైంది.

ఇంతకు ముందే రెండుసార్లు కాళేశ్వరం కమిషన్, తెలంగాణ నీటి పారుదల శాఖకు లేఖలు రాసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పంపించాల్సిందిగా కోరగా, మొన్నటి వరకు స్పందించలేదు. ఈటల, హరీశ్ తో పాటు కేసీఆర్ విచారణ తరువాత మూడో సారి లేఖను నీటి పారుదల శాఖకు పంపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటంటూ మందలించింది కూడా. ఈ విషయాన్ని నీటి పారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం, ఆయన కూడా మంత్రిమండలిలో చర్చించి జూన్ 30వ తేదీలోపు పంపిద్దామని చెప్పారు. ఆ ప్రకారంగానే సోమవారం క్యాబినెట్‌ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ కు అవసరమైన ఫైళ్లన్నింటిని పంపించాలని తీర్మానం చేశారు. ఈ నిర్ణయం బాగున్నప్పటికీ ఏ విధమైన డాక్యుమెంట్లు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన కార్యదర్శి కే రామ‌కృష్ణారావు నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీలో సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం మొదలు పూర్తయ్యే వరకు జరిగిన కార్యకలాపాలు, అనుమతులు, ఉత్తర్వులలో ఏమి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోనున్నది. కాగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామ‌కృష్ణారావు రెండు నెలల క్రితం వరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆయన సమయంలోనే ప్రాజెక్టుకు నిధులు విడుదల అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిమండలి ఆమోదం లేకుండా పనులు చేపట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కే రామ‌కృష్ణారావు నిబద్ధతపై సచివాలయంలోని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ కు అవసరమైన ముఖ్య సమాచారం ఇవ్వకపోవచ్చని, ఇచ్చినా అసంపూర్తిగా అందచేస్తారని చర్చ జరుగుతోంది. సమగ్ర సమచారం ఇస్తే, ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉండడంతో, కమిటీ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మండలి ఆమోదం లేని ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం. అలాంటి బిల్లులు వస్తే నిరభ్యంతరంగా తిరస్కరించి, తిప్పి పంపించే అధికారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఉంటుంది. అభ్యంతరం తెలియచేయకుండా నీటి పారుదల శాఖ పంపిన బిల్లులను ఆమోదించడమే కాకుండా, నిధులు విడుదల చేశారంటున్నారు. ఇదే కాకుండా ప్రాజెక్టు అంచనా వ్యయం అమాంతం పెంచిన సందర్భంలో కూడా ఆమోదించకుండా తిప్పి పంపించే అధికారం ఉంటుంది. ఈ విషయంలో కూడ కే.రామ‌కృష్ణారావు నిబంధనలు పాటించలేదని సచివాలయంలో ఉద్యోగులు అంటున్నారు. అలాంటప్పుడు ఆయన నాయకత్వంలోని కమిటీ, కాళేశ్వరం కమిషన్ కు ఫైళ్లను సమగ్రంగా ఎలా పంపిస్తుందని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version