Site icon vidhaatha

కాళేశ్వ‌రం.. క‌విత‌.. బీఆరెస్‌! గులాబీ నాయకత్వానికి డబుల్‌ ట్రబుల్‌

హైద‌రాబాద్‌, మే 24 (విధాత‌): తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు మొత్తం కాళేశ్వ‌రం, క‌ల్వ‌కుంట్ల క‌విత‌, బీఆరెస్ చుట్టే తిరుగుతున్నాయా అంటే అవున‌నే అనిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్‌ విచారణకు పిలిచింది. దీనికి హాజరవ్వాలా? వద్దా? అనే తర్జనభర్జనల్లో పార్టీ అధినాయకత్వం తలమునకలై ఉన్నది. ఈ సమయంలో కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ.. కలకలం రేపింది. వెరసి.. అటు కాళేశ్వరం, ఇటు కవిత ఇష్యూతో బీఆరెస్‌ డబుల్‌ ట్రబుల్‌ ఎదుర్కొంటున్నదన్న చర్చ సాగుతున్నది.

పిలుస్తున్న కాళేశ్వరం కమిషన్‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విషయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. క‌మిష‌న్ విచార‌ణ‌కు హాజ‌రు కావాలా? వ‌ద్దా? అన్న మీమాంస‌లో కేసీఆర్ ఉన్నారని తెలుస్తున్నది. ఈ అంశంపైనే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు సమాలోచనలు చేశారని సమాచారం. ఈ నోటీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. మేడిగ‌డ్డ బరాజ్‌ను కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి కూల్చి వేశార‌న్న ఆరోప‌ణ‌లు రాజ‌కీయాల‌లో వేడిని పుట్టించాయి.

కేటీఆర్ ఆరోప‌ణ‌లను తీవ్రంగా తీసుకున్న స‌ర్కారు.. ఈ విషయంలో సీబీఐ విచారణ కోరే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను క‌ట్టిన‌ బీఆరెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడే మేడిగ‌డ్డ బరాజ్‌ కుంగ‌డం గ‌మ‌నార్హం. ల‌క్ష కోట్ల ఖ‌ర్చుతో నిర్మించిన‌ కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నాలుగేళ్లు కూడా స‌రిగా లేద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై క‌మిషన్ విచార‌ణకు హాజ‌రు కావాలని ఆదేశిస్తే అడ్డగోలు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కాంగ్రెస్‌ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సీబీఐ విచారిస్తే ఎవరేమిటో తేలిపోతుంది కదా? అని అంటున్నారు. కాంగ్రెస్ నిజంగా సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే ప‌రిస్థితి ఎమిట‌న్న చ‌ర్చ బీఆరెస్ వ‌ర్గాల‌లో జోరుగా జ‌రుగుతోంది. ఈ విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే కవిత రాసిన లేఖ.. పార్టీ నాయకత్వాన్ని సూటిగా.. గట్టిగానే తాకింది.

ఇరకాటంలో పడేసిన లేఖ

రజతోత్సవ సభ, పార్టీలో ఇతర విషయాలపై తన తండ్రి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ లేఖపై స్పందించేందుకు కేసీఆర్‌ కుటుంబంలోని కీలక నేతలైన కేటీఆర్‌, హరీశ్‌రావు స్పందించడానికి నిరాకరించడం గమనార్హం. బీజేపీకి బీఆరెస్‌ దగ్గరవుతున్నదనే సంకేతాలను రజతోత్సవ సభలో కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఇచ్చిందనే సంకేతాలు పార్టీ క్యాడర్‌కు వెళ్లాయని ఆ లేఖలో ఉండటం మరీ ఇబ్బందికర పరిస్థితికి నెట్టేసింది. ఢిల్లీ మద్యం కేసులో తనను ఇరికించి, జైల్లో పెట్టినా.. బీజేపీని తన తండ్రి పల్లెత్తు మాట అనకపోవడాన్ని ఆమె సహజంగానే జీర్ణించుకోలేరని పరిశీలకులు అంటున్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారన్న అసంతృప్తి ఆమెలో ఉన్నదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కవిత లేఖ బీఆరెస్‌కు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అమెరికా నుంచి రావడానికి ఒక్క రోజు ముందు ఈ లేఖ బయటకు రావడం వెనుక ట్విస్ట్‌ ఏంటనే చర్చ జోరుగా సాగుతున్నది. జైలు నుంచి వచ్చిన తర్వాత తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతున్న విషయం గమనించిన కవిత.. ఈ మధ్యే చాలా యాక్టివ్‌ అయిపోయారు. అనేక కీలక అంశాలను లేవదీస్తున్నారు. అదే సమయంలో అవసరమైతే కొత్త పార్టీ పెడతానని తన సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానించారని సమాచారం. త‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఒక‌రిద్ద‌రు మీడియా మిత్రుల వ‌ద్ద కూడా త్వ‌ర‌లో సంచ‌లన ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్పిన‌ట్లు మీడియా వ‌ర్గాల‌లో చ‌ర్చ జరుగుతున్నది. అయితే.. తదుపరి బీఆరెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పిన ఆమె సన్నిహితులు ఆమెను వారించినట్టు సమాచారం. అయినా కూడా.. కవిత లేఖ బయటకు రావడం గమనార్హం. ఆ లేఖ ఎవరు బయటపెట్టాలన్నది ఇప్పుడు తేలాల్సి ఉన్నది.

కొసమెరుపు:

విదేశాలకు వెళ్లిన కవిత శుక్రవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందే ఎయిర్‌పోర్ట్‌ వెలుపల తెలంగాణ జాగృతి కార్యకర్తలు హంగామా చేశారు. విశేషమేంటంటే.. వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, లేదా జెండాల్లో కవిత బొమ్మలే కనిపించాయి. పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫొటో మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం.

Exit mobile version