Film Industry Shadow Minister| తెలంగాణ సినీ పరిశ్రమలో షాడో మంత్రి హల్చల్? ఫిలింనగర్‌ వర్గాల్లో జోరుగా చర్చలు!

తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు. కానీ.. ఆయనకు మించిన పవర్స్‌ ఆయనకు షాడోలా వ్యవహరిస్తున్న వేరే వ్యక్తికి ఉన్నాయన్న చర్చలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి.

హైదరాబాద్, అక్టోబర్‌ 6 (విధాత ప్రతినిధి)

Film Industry Shadow Minister| ఇప్పటి వరకు డిఫ్యాక్టో సీఎం అని విన్నాం కానీ.. షాడో మినిస్టర్ అని ఈ మధ్య కాలంలో వినడంలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత షాడో మినిస్టర్‌ ఒకరు తెరమీదికి వచ్చారనే చర్చలు జరుగుతున్నాయి. అదికూడా సినీ పరిశ్రమలో. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా షాడో మినిస్టర్‌ పనులు చక్కబెడుతున్నారనే ప్రచారానికి బలం పెరిగింది. టిక్కెట్ ధరలు పెంచాలన్నా, బెనిఫిట్‌ షోలు కావాలన్నా, ఫంక్షన్‌కు అనుమతులు కావాలన్నా ఆయన వద్దకు వెళ్తే పని అయిపోయినట్టేనని సినీ వర్గాలు ధీమాగా ఉన్నాయనేది ఫిలింనగర్‌ ముచ్చట.

సీఎం అండతోనే?

హైదరాబాద్ నగరంలో సినీ పరిశ్రమను షాడో మినిస్టర్‌ సీఎం అండ చూసుకుని శాసిస్తున్నారనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నా ఆయన అధికారాలకు విలువ ఇవ్వడం లేదంటున్నారు. బెనిఫిట్‌ షో మొదలు, సినీ కార్మికుల వేతనాల వివాదం, టిక్కెట్ ధరల పెంపు, సినిమా ఫంక్షన్లు అన్నీ ఈయన కనుసైగలతోనే జరుగుతున్నాయని పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. కొద్ది నెలలుగా షాడో మినిస్టర్‌ సాగిస్తున్న హవాపై సినిమాటోగ్రఫీ మంత్రి కూడా లోలోపల రగిలిపోతున్నారని సమాచారం. ‘మంత్రిని నేను, మధ్యలో వీడి పెత్తనం ఏంటి?’ అని తన సహచరుల ముందు వాపోతున్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ‘షాడో మినిస్టర్‌ అనుమతి ఇస్తేనే సినీ రంగంలో ఏ పనైనా జరుగుతుందని అంటున్నారు.. ఇదేమి పద్దతి? అని మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

షాడో వెనుక ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్య నిర్ణయాలు సంబంధిత మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోతున్నాయంటున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో పుష్ఫ-2 చిత్రం ప్రదర్శన సందర్భంగా తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటనను అప్పట్లో సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటన తరువాత సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇక నుంచి తెలంగాణలో సినిమాలకు బెనిఫిట్‌ షో లు ఉండవని, టిక్కెట్ ధరలు కూడా పెంచేది లేదని ప్రకటించారు. ఎవరి నుంచి ఒత్తిడి వచ్చిందో, షాడో మినిస్టర్‌ ఏం చెప్పారో తెలియదు కానీ కొద్ది రోజులకే టిక్కెట్ ధరలు పెంచుతూ హోం శాఖ నుంచి జీవోలు జారీ అవుతున్నాయి. ఈ తతంగం వెనకాల షాడో తో పాటు, ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌ ఉన్నారనే టాక్ పరిశ్రమలో కోడై కూస్తున్నది. షాడో మినిస్టర్‌కు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించుకున్న తరువాతే టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వస్తున్నాయని పెద్ద నిర్మాతలు, హీరోలు సీఎంను కలిసిన సందర్భంలో చెప్పినా ఏ విధమైన ప్రతిస్పందన లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టిక్కెట్ ధరలు పెంచుతూ జీవో ఇవ్వగా, దీనిపై సంబంధిత మంత్రి స్పందిస్తూ తనకేమీ తెలియదని వ్యాఖ్యానించడం విశేషం. హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి తనకు తెలియకుండా ఉత్తర్వులు ఇచ్చారంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

బ్లాక్‌ టికెట్ల దందా!

టిక్కెట్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే విధంగా షాడో మినిస్టర్‌ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా విన్పిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ ఏడాది జూలై నెలాఖరులో తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తెలంగాణ లేబర్ కమిషనర్‌ను కలిశారు. గతంలో సినీ నిర్మాతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పెంపుదల చేయకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి సమ్మెకు దిగి షూటింగ్ లను నిలిపివేస్తామని తెలిపారు. చెప్పిన ప్రకారంగానే సినీ కార్మికులు సమ్మె కు దిగి, 18 రోజులు పాటు ఆందోళనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం వేతనాలు పెంచాల్సిందేనని మీడియాతో అన్నారు. సమాజంలో అందరూ బతకాలని, తమ ప్రభుత్వ విధానం అని కూడా చెప్పారు. సంబంధిత మంత్రి ఇరు వర్గాలతో చర్చించి, డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయగా, అమలు సాధ్యం కాదంటూ బుట్టదాఖలు అయ్యాయి. షాడో మినిస్టర్ రంగంలోకి దిగి, నిర్మాతలందరినీ ఒక చైర్మన్ వద్దకు తీసుకువెళ్లి, ఆ తరువాత సీఎం వద్దకు తీసుకువెళ్లారని సచివాలయంలో కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఇద్దరి మధ్య షాడో మధ్యవర్తిత్వం వహించి, సంబంధిత మంత్రికి తెలియకుండానే కార్మిక శాఖ కమిషనర్ ద్వారా ఆదేశాలు ఇప్పించారంటున్నారు. సినీ పరిశ్రమలో మంత్రికి పలుకుబడి లేదని, షాడో మినిస్టర్‌దే పెత్తనమనే ప్రచారం కూడా బలపడింది. ఒక కార్పొరేషన్ చైర్మన్‌తో కలిసి సదరు షాడో బ్లాక్ దందాలు చేస్తున్నారంటున్నారు. తాజాగా ఓజీ మువీ టిక్కెట్లు బ్లాక్ లో విక్రయించారని సినిపరిశ్రమలో ప్రచారం జోరందుకున్నది. అంతకు ముందు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ప్రత్యేక రాయితీల వెనక కూడా ఈయన ఉన్నారంటున్నారు. ఆయన దయ వల్లే తన సినిమాకు టిక్కెట్ ధరల పెంపు, స్పెషల్ షో లకు అనుమతులు వచ్చాయంటూ ఒక ప్రొడ్యూసర్ కార్యక్రమ వేదికపై బహరంగంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Exit mobile version