- లక్డారం లో 42 యూనిట్లు బీఆర్ఎస్ నేతలవే!
- ఎన్జీటీ ఆదేశాలపై ద్వంద్వ వైఖరి
- తెలంగాణ సర్కార్ వింత పోకడ
- ప్రజల ప్రాణాలు కాదు రాజకీయం ముఖ్యమా?
- ఎమ్మెల్యే మహిపాల్ చేరికతో మైనింగ్ గొడవ ఆగిందా?
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Illegal Stone Crushers | నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీజీ పోలీసు అకాడెమీ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించగానే వెంటనే ఆపివేసిన ప్రభుత్వం.. స్టోన్ క్రషర్ల మూలంగా పర్యావరణం దెబ్బతింటున్నదని, అనుమతిలేని వాటిపై తనిఖీలు నిర్వహించి మూసివేయాలని అదే ఎన్జీటీ ఆదేశిస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేని క్రషర్లను మూసివేస్తే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులకు నెలనెలా వచ్చే ఆమ్యామ్యాలు ఆగిపోతాయనే పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క పటాన్ చెరు మండలం లక్డారంలోనే 42 స్టోన్ క్రషర్ యూనిట్లు నడుస్తున్నాయని సమాచారం. ఈ యూనిట్లు అన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందినవారివి, ఇందులో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ యూనిట్ కూడా ఉందని తెలుస్తున్నది. అందుకే క్రషర్లపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లపై గతేడాది అక్రమ మైనింగ్ కేసులో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి రెండు రోజుల పాటు సోదాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా చర్యలు లేవు!
అక్రమ స్టోన్ క్రషర్ యూనిట్ల మూలంగా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా రోడ్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు ధ్వంసం అవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినా జిల్లా కలెక్టర్లు, మైనింగ్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. స్టోన్ క్రషర్ యూనిట్ల అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మూడు టీమ్ లను ఏర్పాటు చేసింది. ఈ మూడు టీమ్‌లు నగరంతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో తనిఖీలు నిర్వహించాయి. నగరం చుట్టు పక్కల సుమారు 190 అనుమతి లేని స్టోన్ క్రషర్ యూనిట్లు ఉన్నాయని నివేదిక తయారు చేసి, గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఎమ్మెల్యే అండదండలు!
పటాన్ చెరు మండలం లక్డారంలో సుమారు 42 స్టోన్ క్రషర్ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్నది. మొత్తం యూనిట్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటి మూలంగా తమ పంట పొలాలు నాశనమవుతున్నాయని పలువురు సంగారెడ్డి జల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు అందచేశారు. అధిక లోడు కారణంగా రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని, వాటిని పూడ్చివేయకుండా టిప్పర్లను తిప్పుతున్నారని తెలిపారు. పది చక్రాల టిప్పర్ పై 25 టన్నుల బరువు తీసుకువెళ్లాల్సి ఉండగా 35 టన్నులు తీసుకువెళ్తున్నారని వారు అధికారులకు వివరించారు. అనుమతికి మించి తీసుకువెళ్తున్న వాహనాలను పోలీసులు, రవాణా, ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయకుండా వదిలేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ మూలంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, దుమ్ము, ధూళి కణాలతో శ్వాసకోస వ్యాధులకు గురవుతున్నామని వాపోతున్నారు. పేలుళ్లతో తమ పంట పొలాలు బీడుబారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు బాధితులు అధికారులకు విన్నవించారు.
లక్డారంలో టిప్పర్ల రాకపోకలు నిలిపివేత!
పటాన్ చెరు మండలం లక్డారంలో స్థానికులు మంగళవారం రోడ్డును పూర్తిగా తవ్వేసి టిప్పర్లు, లారీల రాకపోకలను నిలిపివేశారు. చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదానికి పటాన్ చెరు ప్రాంతానికి చెందిన టిప్పరే కారణమని స్థానికులు ఈ చర్యకు దిగారు. అధిక లోడుతో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టిప్పర్ల కారణంగానే మరణాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు గడిస్తున్న క్వారీ, క్రషర్ యజమానులు గ్రామాల రోడ్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. గుంతలు పడినా పూడ్చడం లేదని అన్నారు. అంతకు ముందు రోజు అనగా బస్సు ప్రమాదం జరిగిన వెంటనే లక్డారంలో స్టోన్ క్రషర్ యజమానులు తమ యూనిట్లను మూసివేసి పరార్ అయ్యారు. పోలీసులు, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహిస్తారనే భయంతో తాళాలు వేసుకుని వెళ్లిపోయారంటున్నారు.
గతంలో పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్టు
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్రమ మైనింగ్ మాఫియాను అణచివేయకుండా తన రాజకీయ మనుగడ కోసం బలాన్ని ఉపయోగిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిని గతేడాది మార్చి నెలలో అరెస్టు చేయించిందనే వ్యాఖ్యలు అప్పట్లో వెలువడ్డాయి. అక్రమ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆయనను పటాన్ చెరు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలుకు తరలించారు. అంతకు ముందు లక్డారంలో కుమారుడి పేరిట నడుస్తున్న క్వారీని కూడా సీజ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేయడంతో పాటు మైనింగ్ లీజ్ అగ్రిమెంట్ ముగిసినా రెన్యూవల్ చేయలేదని జిల్లా కలెక్టర్ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదించింది. కమిటీ నివేదిక ప్రకారం పటాన్ చెరు మండలంలోని లక్డారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాల్లో ఐదు మైనింగ్ సంస్థలను సీజ్ చేయగా ఇందులో సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ కూడా ఉంది.
ఈడీ కేసు నమోదు, రూ.300 కోట్ల అక్రమాలు : ఈడీ
లక్డారంలో అక్రమ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు ఆధారంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. గతేడాది జూన్ నెలలో ఈడీ అధికారులు ఎమ్మెల్యే సోదరులతో పాటు నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సోదాల తరువాత ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరులు మైనింగ్ లో రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది. ప్రభుత్వానికి రూ.39 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించింది. ఇలా సంపాదించిన నగదును రియల్ ఎస్టేట్ కు మళ్లించారని, మరికొంత సొమ్మును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేశారని పేర్కొంది. సోదాల్లో రూ.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, బినామీల పేర్ల మీద జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నామని ఈడీ ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహిపాల్ రెడ్డి
ఈ వరుస ఘటనల తరువాత జూలై నెలలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక సమయంలో మంత్రులు సీ దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఉన్నారు. సీఎం ను కలిసిన తరువాత అక్రమ మైనింగ్ వ్యాపారానికి అడ్డంకులు తొలగిపోయాయని, పూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందని పటాన్ చెరు ప్రాంత ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also |
World Tsunami Awarness Day | సునామీ అంటే ఏంటి?.. ఎలా వస్తుందో తెలుసా?
Jemimah Rodrigues | సంచలన మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ లేటెస్ట్ అప్‌డేట్.. ఈసారి సబ్జెక్ట్ క్రికెట్ కాదు!
Zohran Mamdani Election Gen Z Revolution | మమ్దానీ చరిత్రాత్మక విజయం.. జెన్ జీ నిశ్శబ్ద విప్లవం!
Second Marriage | రెండో పెళ్లిపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!
