హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విధాత ప్రతినిధి):
Local Body Elections High Court | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడులైంది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 8 వతేదీన స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా మెరిట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుపుతామని హైకోర్టు ఇదివరకే ప్రకటించింది. దీంతో ఈ నెల 8వ తేదీన కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ కానుంది. గతానికి భిన్నంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి మాత్రం ఐదు విడతల్లో ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలతో ఇబ్బందులా?
తెలంగాణలో ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తారు. గ్రామ పంచాయితీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక రెండో విడతకు అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న నామినేషన్ల ఉపసంహరణ, అక్టోబర్ 31న ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ పోలింగ్ జరిగే రోజునే గ్రామ పంచాయితీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయ్యే సమయానికి గ్రామ పంచాయితీ ఎన్నికల సమయం వస్తుంది. ఇలా ఒక ఎన్నికల తర్వాత మరో ఎన్నిక రాబోతున్నది. ఇది రాజకీయపార్టీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2018 జనవరిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. గతంలో ఈ రకంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేదని రాజకీయ పార్టీలు చెబుతున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందో?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కేశవాపూర్ గ్రామానికి చెందిన బీ మాధవరెడ్డి హౌస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సెప్టెంబర్ 28న హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సమయంలో ఇరువర్గాల వాదనలు హైకోర్టు విన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్టులు జోక్యం చేసుకొనే పరిస్థితి ఉండదనే కారణంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని హైకోర్టుకు తెలంగాణ ఎస్ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేసినా కూడా మెరిట్ ప్రకారం ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేయనుంది. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన విషయమై ఈ నెల 8నే హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలా ముందుకు వెళతాయనే చర్చ నడుస్తున్నది. షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రక్రియ కొనసాగాలని హైకోర్టు ఆదేశిస్తే స్థానిక సంస్థలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మరోవైపు స్థానిక సంస్థలకు రిజర్వేషన్ల విషయంలో గందరగోళం నెలకొందనే ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఈ రిజర్వేషన్లలో శాస్త్రీయత లేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ రిజర్వేషన్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిజర్వేషన్లలో గందరగోళంపై కోర్టును ఆశ్రయించాలని పార్టీలు యోచిస్తున్నాయి.