Site icon vidhaatha

BC Reservations | బీసీ రిజర్వేషన్ల అమలుకు రేవంత్‌ సర్కార్‌ మాస్టర్‌ ప్లాన్‌?

BC Reservations | హైద‌రాబాద్‌, జూలై 26 (విధాత‌): రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం ఏం చేయాల‌న్న విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ సమాలోచనలు చేస్తున్నది. రాష్ట్రంలో చేపట్టిన కుల‌గ‌ణ‌న ప్ర‌కారంగా బీసీల‌కు విద్య‌, ఉద్యోగాలలో 42 రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇదే తీరుగా స్థానిక సంస్థ‌ల‌లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లునూ పంపింది. ఈ రెండు బిల్లుల‌ను కేంద్రం త‌న‌వ‌ద్దే అట్టి పెట్టుకున్న‌ది. సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించిన హైకోర్టు.. రిజర్వేషన్‌లను జూలై 25 నాటికే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి.. బీసీ రిజర్వేషన్ల అమలుకు వీలుగా డ్రాఫ్ట్‌ ఆర్డినెన్స్‌ ను తయారు చేసి, గవర్నర్‌కు పంపింది. సుమారు ప‌ది రోజులు ఆర్డినెన్స్ ఫైల్ ను త‌న వ‌ద్దే పెట్టుకున్న గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మ లీగ‌ల్ ఓపినియ‌న్ తర్వాత జూలై 24న‌ కేంద్ర న్యాయ శాఖకు పంపించారు. అంటే.. హైకోర్టు విధించిన గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు ఈ ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్‌ పంపడం వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు చ‌ట్ట‌బ‌ద్దంగా అమ‌ల‌వుతే కాంగ్రెస్‌కు క్రెడిట్ వ‌స్తుంద‌ని, అందుకే బీజేపీ నేతలు తెరవెనుక కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ఆరోపించారు. ఇప్ప‌టికే బీజేపీ నాయ‌కులు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. ముస్లింల బూచిచూపించి ఈ ఆర్డినెన్స్‌ను వ్య‌తిరేకిస్తున్నారు.

ఢిల్లీ వేదికగా బీజేపీపై ఒత్తిడికి వ్యూహం!

డ్రాఫ్ట్‌ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని ముందే ఊహించిన రేవంత్‌ రెడ్డి, మంత్రులు.. ఢిల్లీ వేదిక‌గా బీజేపీపై ఒత్తిడి తేవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారని తెలిసింది. ఇందులో భాగంగానే ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడితే.. తాము జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగుతామని రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేను కోరారు. మొత్తంగా బీసీ బిల్లులపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఢిల్లీలో ఓబీసీ స‌ద‌స్సు కూడా నిర్వ‌హించింది. ఢిల్లీ వేదిక‌గా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా బీసీల‌కు కాంగ్రెస్ అండ‌గా ఉంటుందనే భావనకు బలం చేకూర్చిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇటు క్షేత్రస్థాయిలోనూ..

ఇటు క్షేత్రస్థాయిలో.. రాష్ట్రంలో బీసీ బిల్లులపై బీజేపీ, బీఆరెస్‌ విధానాలను ఎండగట్టాలని కూడా నిర్ణయించారని తెలుస్తున్నది. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలనే వేదికగా చేసుకోనున్నట్టు పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు తెలిపారు. ‘మా అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణలో కుల గణన చేపట్టాం. రిజర్వేషన్ల కోసం చట్టం చేశాం. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమోదం తెలుప‌కుండా బీసీ వ్య‌తిరేక వైఖ‌రి అవ‌లంబిస్తోంది. ఆర్డినెన్స్ రూపొందిస్తే గ‌వ‌ర్న‌ర్ కేంద్రానికి పంపారు. మా పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీనే రిజ‌ర్వేష‌న్ల‌కు అడ్డం త‌గులుతున్న‌ది’ అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోదండ‌రెడ్డి చెప్పారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అంశంపై బీఆరెస్‌, బీజేపీల‌ను ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌ట్టాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన కాంగ్రెస్.. పార్టీల ప‌రంగా రిజ‌ర్వేషన్లు ఇవ్వ‌డానికి ముందుకు రావాల‌ని అన్ని పార్టీల‌కు పిలుపు నిచ్చే అవ‌కాశం ఉందని తెలుస్తున్నది. ఏ పార్టీ ముందుకు వ‌చ్చినా.. రాకున్నా పార్టీ ప‌రంగా బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేషన్లు క‌ల్పించి ఎన్నిక‌లకు వెళితే ఎలా ఉంటుంద‌న్న దానిపై పార్టీ నాయ‌కులు స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఈ మేర‌కు ఈ నెల 28న నిర్వహించే క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు అభిప్రాయప‌డ్డారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుని స్థానిక ఎన్నికల్లో మైలేజీ పొందే అవకాశం లేకపోలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Air India Flight | ఎయిర్ ఇండియా విమానంలో మహిళకు డెలివరీ.. బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే?
Bhu Bharathi | భూమి సమస్యా? మంత్రిగారు చెప్పాలె! తప్పించుకుంటున్న జిల్లాల కలెక్టర్లు.. 30% కమీషన్‌పై రంగంలోకి బ్రోకర్లు!

Exit mobile version