ఇద్దరు ఎమ్మెల్యేల సిఫారసు..హోంమంత్రి అనుమతి
విమర్శలతో రద్దు..జైలు మార్పు
కూటమి సర్కార్ పై వైసీపీ విమర్శల దాడి
అమరావతి: జీవిత ఖైదు అనుభవిస్తున్నరౌడీషిటర్ శ్రీకాంత్ పెరోల్(Srikanth) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపుతుంది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో(Vangalapudi Anitha) పాటు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(MLA Kotamreddy Sridhar Reddy), పాశం సునీల్ కుమార్(Pasham Sunil Kumar) లు సహకరించారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. శ్రీకాంత్ కు పెరోల్ మంజూరుపై దుమారం రేగడంతో హోంమంత్రి వంగలపూడి అనిత ఆగమేఘాల మీద స్పందించి తక్షణమే అతడి పెరోల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తమకు తెలియకుండా పెరోల్ ఇచ్చారంటూ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేదిగా మారడంతో సీఎం చంద్రబాబు సైతం దీనిపై సీరియస్ అవ్వగా…పెరోల్ వివాదంపై సీఎంవో హోంశాఖను నివేదిక ఇవ్వాలని కోరింది. చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీకాంత్ కు రెండుసార్లు పెరోల్ మంజూరవ్వడం..అనారోగ్య కారణాలతో పెరోల్ పై బయటకు వచ్చిన శ్రీకాంత్ బెదిరింపులు..సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో పాటు ఆసుపత్రిలో తన సన్నిహితురాలైన అరుణతో రాసలీలాడుతున్న వీడియో వైరల్ కావడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. దీనిపై దిద్దుబాటు చర్యలకు దిగిన హోంశాఖ శ్రీకాంత్ వ్యవహారంపై విచారణ జరిపి పెరో ల్ రద్దు చేయడంతో పాటు నెల్లూరు జైలు నుంచి వైజాగ్ జైలుకు తరలించారు. అయితే తీవ్ర నేరాలపై జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ కు రెండుసార్లు పెరోల్ మంజూరు చేయడం వెనుక ఉన్నదెవరు..ఎవరి ప్రయోజనాల కోసం పెరోల్ మంజూరు చేశారన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ, పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తెరవెనుక మతలబు ఏమిటో?
ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మంజూరు వివాదపై టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్‌మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్‌పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది. అయితే ఖైదీ శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వొద్దని నెల్లూరు జైల్ సూపరింటెండెంట్ రిమార్క్స్ రాశారు. ఫలితంగా శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ ఫైల్‌ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ(TDP) ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్‌కి పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు. ఎమ్మెల్యేల ఒత్తిడి… శ్రీకాంత్(Srikanth) సన్నిహితురాలు అరుణ తెరవెనుక మంత్రాంగంతోనే పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్‌ఫైల్‌పై సంతకం పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లిందని.. హోం మంత్రి ఒత్తిడితో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారని… ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయని వైసీపీ ఇప్పటికే ఆధారాలతో సహా విమర్శలు చేసింది.
లేఖలు తిరస్కరించాక పేరోల్ ఎలా మంజూరైందో తేలాలి : కోటంరెడ్డి
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం అతని తండ్రి అభ్యర్థన మేరకు నేను, గూడూరు ఎమ్మెల్యే సునీల్ సిఫారసు లేఖలు ఇచ్చామని.. మా ఎమ్మెల్యేలను కలిశారని.. వాటిపై అధికారులు విచారణ చేసి జూలై 16న మా ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత జులై 30న అధికారులు శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారని..16న మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారని..అధికారులు అలా ఎందుకు చేశారన్నదానిపై విచారిస్తున్నట్లుగా హోంశాఖ మంత్రి అనిత చెప్పారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ఉన్న తాము చాలా మందికి సిఫారసు లేఖలు ఇస్తుంటామని, గతంలో ఇదే రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు వైసీపీ హయాంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సూళ్లురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా లేఖలు ఇచ్చారని, ఆ లేఖల ఆధారంగా శ్రీకాంత్ కి అప్పట్లో పెరోల్ కూడా ఇచ్చారని తెలిపారు. ఇకపై భవిష్యత్తులో తాను ఎవరికీ పెరోల్ లేఖలు ఇవ్వనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.