విద్యార్థులకు ఎంతటి దీన స్థితి..పాలకులు సిగ్గుపడాలి

విధాత : ఓ వైపు చంద్రయాన్..సూర్యయాన్ ప్రయోగాలు.. బుల్లెట్ ట్రైన్ లు…లగ్జరీ విమానాలు. మరోవైపు పల్లెల్లో చదువుకోసం పరితపించే విద్యార్థులకు బడికి వెళ్లేందుకు బస్సులు కూడా దొరకని దుస్థితి. ఇది భారత మాత బిడ్డల దీన స్థితి. అదికూడా ప్రపంచమే అబ్బురపడే రాజధాని అమరావతి నిర్మాణం అంటూ..హైటెక్ నగర నిర్మాతనంటున్న పాలకుల పరిపాలనలోని ఏపీలో అంటే కొంత అశ్చర్యకం కలగమానదు. 50మంది కంటే ఎక్కువ మంది పట్టని బస్సులో ఏకంగా 100మందికి పైగా విద్యార్థులు ఎక్కడంతో ఊపిరి అందక..ముగ్గురు పిల్లలు చావు గుమ్మం దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
గద్దరాళ్ల, పల్లెదొడ్డి, ఓబుళాపురం, మాదాపురం, కప్పట్రాళ్ల, జిల్లడబుడకల గ్రామాలకు చెందిన సుమారు 230 మందికి పైగా విద్యార్థులు బడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో దేవనకొండ బస్ స్టాప్ లో రోజువారి లాగే మంగళవారం బస్సు కోసం ఎదురుచూశారు. బస్సు రాగానే ఒక్కసారిగా తోసుకుంటూ వంద మందికిపైగా ఎక్కేశారు. బస్సు లోపల ఊపిరాడక పోవడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కండక్టర్ లక్ష్మన్న వారిని కిందికి దించి ప్రాథమిక సపర్యలు చేశారు. కొద్దిసేపటికి కోలుకున్న విద్యార్థులు ఇంటికి క్షేమంగా చేరారు. 230మంది విద్యార్థులకు నిత్యం ఒకే బస్సు ఉండటంతో గత్యంతరం లేక విద్యార్థులంతా ఈ బస్సులోనే ఎక్కాల్సి వస్తుందని స్థానికులు, తల్లిదండ్రులు వాపోయారు. నిత్యం అంతమంది విద్యార్థులు బడికి..ఇంటికి వెళ్లేందుకు బస్సులో నలిగిపోతూ సాగిస్తున్న కష్టాల ప్రయాణం ఇన్నాళ్లుగా ఏ ప్రజాప్రతినిధిని కదిలించకపోవడం విచిత్రమే.
అయితే ఈ ఘటన వార్తను పత్రికల్లో చూసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పందించారు. కర్నూలు జిల్లాలో ఒకే బస్సులో సుమారు 100 మంది హైస్కూల్ విద్యార్థులు ప్రయాణించిన ఘటన తనను తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఇది విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగించే అంశం అని..రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదకర ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరారు.