ఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు
కరోనా వైద్య చికిత్సలకుఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలురాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ విధాత,అమరావతి: కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన […]

కరోనా వైద్య చికిత్సలకు
ఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
విధాత,అమరావతి: కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 84,224 శాంపిళ్లు టెస్టులు చేయగా, 16,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మంది మృతి చెందారని తెలిపారు. గతంలో కంటే నేడు తక్కువ పాజిటివ్ రేటు నమోదయ్యిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్లు 6,226 ఉండగా, 5,414 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు.
గురువారం మధ్యాహ్నానికి 812 బెడ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆక్సిజన్ బెడ్ల కూడా మిగిలిన రోజులకంటే ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 23,464 ఆక్సిజన్ బెడ్లు ఉండగా, 19,912 బెడ్లు రోగులతో నిండిపోగా, 3,552 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 16,689 మంది చికిత్స పొందుతున్నారన్నారు. గతంలో 18,500 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందే వారిని, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతూ వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పలు ఆసుపత్రుల నుంచి కరోనా బాధితుల డిశ్చార్జీలు పెరిగాయని, అదే సమయంలో అడ్మిషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 1,00,602 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 25 రోజుల కిందట 19 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండేవన్నారు. ఇపుడా ఆ సంఖ్య లక్షకు పైగా చేరిందన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 3,927 డోసులు అందజేశామన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందజేసే 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కంటే గడిచిన 24 గంట్లో 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డ్రా చేశామన్నారు.
తుఫాన్ దృష్ట్యా ఆక్సిజన్ ను నిల్వ చేయాలనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి కేంద్రం నుంచి అధికంగా డ్రా చేస్తున్నామన్నారు. ఈ నెల 21వ తేదీన 687 మెట్రిక్ టన్నులు, 22న 769 మెట్రిక్ టన్నులు, 23న 656 మెట్రిక్ టన్నులు, 24న 767 మెట్రిక్ టన్నులు, 25న 720 మెట్రిక్ టన్నుల చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జమ్ షెడ్ పూర్ నుంచి 64 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, దుర్గాపూర్ నుంచి 72 మెట్రిక్ టన్నులు, రూర్కెల్లా నుంచి 48 మెట్రిక్ టన్నులను ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ద్వారా తెప్పించుకున్నామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనే తక్కువ కేసులు నమోదు…
గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయంటూ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురితమవుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తప్పుడు వార్తలతో గ్రామీణ ప్రజల్లో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. పట్టణ ప్రాంతాల మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో 144 సెక్షన్, కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ పనులు, ఉత్పత్తుల సరఫరాకు కొంచెం సడలింపులు ఇచ్చామన్నారు. గత వారం రోజుల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నమోదైన కరోనా కేసులను గమనిస్తే… పల్లెల్లో తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ఈ నెల 16 వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ వారం రోజుల డేటా గమనిస్తే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 1,42,707 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 56,058 కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో 86,649 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ సంఖ్యను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగాయంటూ వార్తలు ప్రచురించడం సరికాదన్నారు. వాస్తవంగా చూస్తే… 2011 జనాభా లెక్కల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో కోటీ 46 లక్షల జనాభా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల 49 లక్షల 67 మంది ఉన్నారన్నారు. ఈ లెక్కన చూస్తే అర్బన్ జనాభా 29.46 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 70.54 శాతం జనాభా ఉందన్నారు. ప్రతి లక్ష జనాభాను ప్రాతిపదికగా చేసుకుంటే… అర్బన్ లో 383 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 248 కరోనా బారినపడ్డారన్నారు. ఈ డేటా ను గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువసంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయనే విషయం అవగతమవుతుందన్నారు. ఇవేవీ గమనించకుండా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగాయనడం అవాస్తవమన్నారు.
గతేడాది కంటే అదనంగా 1400 వైద్య సిబ్బంది నియామకం…
గతేడాది కంటే ఈ ఏడాది కరోనా నివారణ నేపథ్యంలో అదనంగా వైద్య సిబ్బందని నియమించుకున్నామన్నారు. గతేడాది 17,315 మందిని నియమించుకుంటే ఈ ఏడాది 18,763 మంది వైద్య సిబ్బందిని తీసుకున్నామన్నారు. గతేడాది కంటే 1400 మందిని అధికంగా నియమించుకున్నామన్నారు. కరోనా నివారణలో వైద్య విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామన్నారు. 2,364 పీజీ విద్యార్థులు, 3,086 హౌస్ సర్జన్లు, 808 ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు, 2, 386 నర్సింగ్ విద్యార్థులు, 315 మంది డెంటల్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నామన్నారు.
బ్లాక్ ఫంగస్ నివారణకు ఆంపోటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్ల అందజేత
రాష్ట్రంలో నేటి వరకూ 579 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం మధ్యాహ్నం మరో 1800 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను వచ్చాయని, వాటిని అన్ని జిల్లాలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇదివరకే కేంద్రం అందజేసిన 3 వేల పైబడిన ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను అన్ని జిల్లాలకు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం అందజేసిన పొసకొనజోల్ 240 ఇంజక్షన్లు, 8,340 ట్యాబెట్లు కూడా జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. ప్రతి జిల్లాలోనూ కొవాగ్జిన్ సెకండ్ డోసు, కొవిషీల్డ్ ఫస్ట్ డోసు రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్నామన్నారు.
రాబోయే నాలుగు రోజుల్లో ఉన్న వ్యాక్సిన్లను వేయాలని ఆదేశించామన్నారు. బుధవారం రెండున్నర లక్షల మందికి టీకాలు వేయగా, నిన్నటి వరకూ 84,13,616 వ్యాక్సిన్లు వేశామన్నారు. వాటిలో 23,81,900 మందికి సెకండ్ డోసు, 36,49,816 మందికి ఫస్ట్ డోసు వేశామన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర (నిన్నటి వరకూ) 1,41,774 కొవాగ్జిన్, 13,88,610 కొవిషీల్డ్ డోసులు ఉన్నాయన్నారు. మే నెలలో 83,759 మందికి కొవాగ్జిన్ సెకండ్ డోసు, కొవిషీల్డ్ 13.85 లక్షల ఫస్ట్ డోసుగా వేస్తున్నామన్నారు. జూన్ నెలకు సంబంధించి ఆ నెల 15వ తేదీలోగా కేంద్రం నుంచి 5,90,140 డోసుల కొవిషీల్డ్, 1,77,870 కొవాగ్జిన్ డోసులు రానున్నాయన్నారు. ఆ డోసులతో పాటు ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఉన్న డోసులతో కలిపి 24,62,000 డోసులు అందుబాటులోకి రానున్నాయన్నారు.
అధికంగా ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు
కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులపై పెనాల్టీ విధించామన్నారు. ఇటీవలే కరోనా వైద్య చికిత్సలకు అందజేసే ఫీజుల రేంటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే ఏపీలో పెంచిన ఫీజులు రీజనబుల్ గా నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకు కూడా పెంచిన ఫీజులనే చెల్లిస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే బిల్లులను నోడల్ అధికారులు, వారి బృందాలు మానటరింగ్ చేయాలని అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ ఆదేశించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కంటే అధికంగా వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. కరోనా థర్డ్ వేవ్ పై మీడియాలో నిపుణులు నుంచి వస్తున్న సూచనలను పరిగణలోనికి తీసుకుని సీనియర్ అధికారులతో ఒక కమిటీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించాలని ఆదేశించారన్నారు. ఆ కమిటీ కరోనా థర్డ్ వేవ్ వస్తే…ఎదుర్కొనడానికి అవసరమైన ఐసీయూ బెడ్లు ఏర్పాటుతో పాటు మందుల కొనుగోలుపై వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వనుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. కృష్ణపట్నం మందుపై రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.