చిన్న మంత్రం.. గొప్ప తత్వం.. గాయత్రీ మహామంత్రం – అర్థం, ప్రాముఖ్యత, ఉపాసన విధానం
గాయత్రీ మహామంత్రం అర్థం, ప్రాముఖ్యత, జప విధానం: బుద్ధి శుద్ధి, ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రాచీన వేదకాలంలో ప్రసిద్ధమైన పవిత్ర మంత్రం.
మన సంస్కృతిలో వేలాది మంత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడే ఒక మంత్రం ఉంది. అదే గాయత్రి మంత్రం. వేదాలలో దీనికి ఎంతో గొప్ప స్థానం ఉంది. హిందూ సంప్రదాయంలో దీనిని “వేదమాత” అని కూడా పిలుస్తారు. ఈ మంత్రం తొలిసారిగా రుగ్వేదంలో కనిపించింది. ప్రాచీన వేదకాలంలో విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని దర్శించినట్లు సంప్రదాయం చెబుతోంది.
మరి ఈ గాయత్రీ మంత్రం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఎలా జపించాలి?
ఎందుకు ఇది అంత గొప్పగా భావించబడుతోంది? ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
గాయత్రీ మంత్రం ఇలా ఉంటుంది:
ఓం భూర్భువః స్వః
తత్ సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
ఈ మంత్రం చాలా చిన్నదిగా కనిపించినా… దీనిలో గొప్ప తత్వం దాగి ఉందని వేదాలు చెబుతాయి. ఈ మంత్రాన్ని సరళంగా అర్థం చేసుకుంటే ఇలా ఉంటుంది. సృష్టిని వెలిగించే దైవిక శక్తిని మనం ధ్యానం చేస్తున్నాం. ‘ఆ దివ్య కాంతి మన బుద్ధులను జ్ఞాన మార్గంలో నడిపించుగాక’ అని మనం ప్రార్థిస్తున్నాం. ఇది గమనిస్తే… ఈ మంత్రంలో సంపద కోరడం లేదు. శక్తి కోరడం లేదు. కోరుతున్నదల్లా ఒక్కటే. అది.. సద్బుద్ధి! అందుకే గాయత్రీ మంత్రాన్ని “బుద్ధి శుద్ధి కోసం చేసే ప్రార్థన” అని కూడా అంటారు.
వేద తత్వం ప్రకారం ఈ మంత్రం మూడు స్థాయిలను సూచిస్తుంది. మొదటిది భౌతిక స్థాయి. ఇక్కడ “సవిత” అనే పదం సూర్యుడిని సూచిస్తుంది. సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదు. అందుకే సూర్యుని దైవిక శక్తికి ప్రతీకగా భావించారు. రెండోది మానసిక స్థాయి. మన బుద్ధి సరైన మార్గంలో నడవాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. అదే ఈ మంత్రం కోరుతున్నది. మూడోది ఆధ్యాత్మిక స్థాయి. మనిషి చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ధ్యాన మంత్రంగా గాయత్రీని భావించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం గాయత్రీ మంత్రాన్ని సాధారణంగా
ఉపనయన సంస్కారం సమయంలో ఉపదేశిస్తారు. ఈ సంస్కారాన్నే ‘బ్రహ్మోపదేశం’ అని కూడా అంటారు. ఈ సంస్కారం జరిగిన తరువాత వ్యక్తిని “ద్విజుడు” అని పిలుస్తారు. ద్విజుడు అంటే “రెండో జన్మ పొందినవాడు” అనే అర్థం. మొదటి జన్మ తల్లిదండ్రుల వల్ల వస్తుంది. కానీ ఉపనయన సంస్కారం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించడం రెండో జన్మగా భావించారు.
గాయత్రీ మంత్ర జపం ప్రధానంగా సంధ్యావందనంలో భాగంగా ఉంటుంది. సంధ్యావందనం రోజుకు మూడు సార్లు చేస్తారు.
ప్రాతఃసంధ్య – ఉదయం సూర్యోదయానికి ముందు.
మాధ్యాహ్నిక సంధ్య – మధ్యాహ్నం.
సాయంసంధ్య – సూర్యాస్తమయం సమయం.
ఈ సంధ్యావందనంలో గాయత్రీ మంత్రాన్ని జపించడం ప్రధాన భాగం.
సంప్రదాయంగా 108 సార్లు జపిస్తారు.
ఉపనయన సంస్కారం తరువాత ధరించే పవిత్ర దారాన్ని యజ్ఞోపవీతం అంటారు. దీనిని సాధారణంగా “జంధ్యం” అని కూడా అంటారు. ఈ యజ్ఞోపవీతం ఆధ్యాత్మిక బాధ్యతలను గుర్తు చేసే ప్రతీకగా భావించబడుతుంది.
స్త్రీలు గాయత్రీ మంత్రం జపించవచ్చా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న.
పురాతన ధర్మశాస్త్ర సంప్రదాయాల్లో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ
వేద కాలంలో స్త్రీలు కూడా వేదాధ్యయనం చేసినట్లు గ్రంథాలు చెబుతాయి. ఉదాహరణకు వేదాల్లో ప్రసిద్ధి చెందిన మహిళా ఋషులు… గార్గి వాచక్నవి, మైత్రేయి. ఆధునిక కాలంలో అనేక ఆధ్యాత్మిక గురువులు కూడా గాయత్రీ మంత్రాన్ని అందరూ జపించవచ్చని చెబుతున్నారు. దయానంద సరస్వతి, శ్రీరామ శర్మ ఆచర్య వంటివారు వారు గాయత్రీ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు.
గాయత్రీ మంత్రం ఎందుకు ప్రత్యేకం?
వేదాల్లో ఒక ప్రసిద్ధ వాక్యం ఉంది. “న గాయత్ర్యా పరం మంత్రం”.
అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని అర్థం. ఈ మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఈ 24 అక్షరాలు 24 దైవిక శక్తులను సూచిస్తాయని కూడా చెబుతారు. గాయత్రీ మంత్రం ఒక సాధారణ ప్రార్థన మాత్రమే కాదు. ఇది ఒక తత్వం. మన బుద్ధి సత్యాన్ని తెలుసుకోవాలి. మన జీవితం ధర్మ మార్గంలో నడవాలి. అదే ఈ మంత్రం సందేశం. అందుకే వేల సంవత్సరాలుగా గాయత్రీ మంత్రం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ముఖ్యమైన స్థానం సంపాదించింది. భక్తితో, ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత లభిస్తాయని అనేక మంది విశ్వసిస్తున్నారు.
ఇక్కడ ఒక విషయం చాలా మందికి సందేహంగా ఉంటుంది. గాయత్రీ మంత్రం అందరూ జపించవచ్చా? లేక కొంతమందికే పరిమితమా? పారంపరిక వేద సంప్రదాయంలో గాయత్రీ మంత్రాన్ని చాలా పవిత్రమైన మంత్రంగా భావించారు. అందుకే దీనిని సాధారణంగా ఉపనయన సంస్కారం సమయంలో గురువు శిష్యునికి ఉపదేశించే పద్ధతి ఏర్పడింది.
ఆ తరువాత ఆ వ్యక్తి ప్రతిరోజూ త్రిసంధ్య సంధ్యావందనంలో గాయత్రీ మంత్రాన్ని జపించాలి అనే ఆచారం ఏర్పడింది. ఈ విధానం ప్రధానంగా వేద అధ్యయన సంప్రదాయంలో ఏర్పడింది. అందువల్ల వేద గాయత్రీ మంత్రం జపానికి కొన్ని ఆచార నియమాలు కూడా చెప్పారు.
వేద గాయత్రీ మంత్రం వేద సంప్రదాయం ప్రకారం జపించాలి అనే ఆచారం ఉన్నప్పటికీ, దేవిని ధ్యానించే ఇతర గాయత్రీ రూపాలు లేదా ప్రార్థనలను భక్తితో ఎవరైనా జపించవచ్చు అని వారు చెబుతున్నారు.
ఉదాహరణకు:
ఓం సర్వ చైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్
లేదా సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవి గాయత్రీ మంత్రాలు భక్తితో జపించదగిన ప్రార్థనలుగా అనేక మంది పండితులు వివరించారు.
ఇవి కూడా చదవండి :
Zodiac Signs | ఉగాది తర్వాత.. ఈ రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది..!
Ancient Vishnu statue| వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram