YS Jagan | ఏపీ మాజీ సీఎం జగన్, ఇద్దరు ఐపీఎస్‌లపై ఎఫ్‌ఐఆర్
మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్టు చేసి, శారీరకంగా హింసించారన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

అమరావతి: మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్టు చేసి, శారీరకంగా హింసించారన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. గతంలో రఘురామకృష్ణం రాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచారు. కానీ.. తర్వాత జగన్‌తో తీవ్ర విభేదాలు వచ్చాయి. తనను ఏపీ సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేసి, స్థానిక కోర్టులో ప్రవేశపెట్టకుండా ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా రాష్ట్రం వెలుపలికి తరలించారని రఘురామకృష్ణం రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు జగన్, ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో జగన్‌ను ఏ3గా పేర్కొన్న పోలీసులు.. సునీల్ కుమార్‌ను ఏ 1గా, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును ఏ2గా, విజయపాల్‌ను ఏ4గా, డాక్టర్ ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టులో రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయనను రాజద్రోహం అభియోగాలతో 2021 మే 14న అరెస్టు చేశారు. ఐపీసీ 124 ఏ (రాజద్రోహం), 153 ఏ (వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505 (ప్రజలకు కీడు చేయడం) అభియోగాలపై నోటీసు జారీ చేసిన సీఐడీ అధికారులు.. ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత ఈ కేసులో రఘురామకృష్ణం రాజు బెయిల్ పొందారు.
సీబీఐ కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనపై మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఇతర అధికారులను తనపై చేయిచేసుకున్నారని రఘురామకృష్ణం రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెల్టు, లాఠీలతో ఇష్టం వచ్చినట్టు బాదారని తెలిపారు. తాను హార్ట్ సర్జరీ చేసుకుని ఉన్నా.. తనకు ఔషధాలు తీసుకునేందుకు అనుతించలేదని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకే అధికారులు తనపై దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
తన మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు పాస్ వర్డ్ చెప్పే వరకూ కొందరు తన ఛాతీపై కూర్చొన్నారని ఆయన తెలిపారు. జగన్‌ను విమర్శించడం కొనసాగిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వస్తుందని తనను హెచ్చరించారని పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జగన్, ఇద్దరు సీఐడీ అధికారులపై కేసులు నమోదు చేశారు. 2019లో నరసాపురం స్థానం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రాజు.. ఎన్నికల అనంతరం జగన్‌తో విభేదాలు ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి జగన్‌పై, ఆయన పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.