Kurnool Bus Accident Video : మద్యం మత్తులో బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్..సీసీ టీవీ ఫుటేజీ వెల్లడి

కర్నూల్ బస్సు ప్రమాదానికి మద్యం మత్తులో ఉన్న బైకర్ కారణమని సీసీ టీవీ ఫుటేజీతో బయటపడింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Kurnool Bus Accident Video : మద్యం మత్తులో బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్..సీసీ టీవీ ఫుటేజీ వెల్లడి

విధాత : కర్నూల్ బస్సు ప్రమాదంలో కీలకంగా మారిన బైకర్ శివశంకర్ కు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రమాదానికి ముందు శివశంకర్ మరో స్నేహితుడితో కలిసి ఓ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కోసం ఆగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివశంకర్ బంక్ వద్ధ తన బైక్ తో రాష్ గా విన్యాసాలు చేయబోయే స్కిడ్ అయ్యాడు. స్నేహితుడితో శివశంకర్ మత్తులో అక్కడి నుంచి స్వగ్రామానికి పయనమయ్యాడు. బంక్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురై.. బస్సు ప్రమాదానికి కారణమైనట్లుగా సీసీ టీవీ ఫుటేజీ మేరకు అంచనా వేస్తున్నారు. వి.కావేరి బస్సు కంటే ముందుగానే బైక్ ప్రమాదానికి గురై రోడ్డు మీద పడిఉండటం..ఆ వెంటనే కావేరి బస్సు డ్రైవర్ దానిపై నుంచి వెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంకు నుంచి మంటలు రేగి బస్సుకు అంటుకుని 19మంది సజీవ దహనానికి దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

సీసీ టీవీ ఫుటేజీ చూసిన నెటిజన్లు.. ఇలాంటి ప్రమాదకర డ్రంక్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా జారీ అవుతోంది? రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతోంది? అనే అంశాలపై ఆర్టిఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ బస్సు తగలబడిన తర్వాతే అలర్ట్ అవుతున్న ఆర్టిఏ అధికారులు ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కనిపించే ఈ తాత్కాలిక తనిఖీలు కాదు. మళ్లీ ఇలాంటి ప్రాణాంతక ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుని కఠినమైన నియంత్రణ అమలు చేయాలని, ఇదే ప్రజల డిమాండ్ అని..వారి ప్రాణాల భద్రత విషయంలో రాజీపడే హక్కు ఎవరికీ లేదు అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.