నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో ల్యాండింగ్ సమస్య
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ సమస్య

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ సమస్య ఎదుర్కోవడం కలకలం రేపింది. ఇండిగో విమానం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా విమానాన్ని పైలట్ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న వీల్ ప్యానల్ తెరుచుకోలేదు. దీంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు.
ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణికులకు సమస్యను వివరించాడు. 20నిమిషాల పాటు విమానాన్ని గాల్లో తిప్పి వీల్ ప్యానల్‌ను చెక్ చేసుకుని రెండోసారి విమానాన్ని సురక్షితంగా రన్ వేపై పైలట్ ల్యాండ్ చేశాడు. ఈ విమానంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఉండటంతో విమానం టేకాఫ్ సమస్య చర్చనీయాంశమైంది. నిజం చెబుతా సభలకు హాజరయ్యేందుకు భువనేశ్వరి జూబ్లిహీల్స్‌లోని తమ నివాసం నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు.