సౌతాఫ్రికాకి మ‌ళ్లీ సెమీస్‌లో నిరాశ‌.. ఇండియాతో ఫైన‌ల్ ఆడ‌నున్న ఆసీస్

సౌతాఫ్రికాకి మ‌ళ్లీ సెమీస్‌లో నిరాశ‌.. ఇండియాతో ఫైన‌ల్ ఆడ‌నున్న ఆసీస్

వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్‌లో ఇండియా ప్ర‌త్య‌ర్ధి ఎవ‌రో తెలిసిపోయింది. గ‌త రాత్రి సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన సెమీస్ మ్యాచ్ చాలా ఉత్కంఠ‌గా సాగ‌గా, ఈ మ్యాచ్‌లో చివ‌రికి ఆసీస్‌ని విజ‌యం వరించింది.విజయం కోసం చివరి వరకు పోరాడిన సౌతాఫ్రికాను దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి. ప‌లు క్యాచ్‌లు చేజార్చ‌డంతో సౌతాఫ్రికా త‌గిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. డేవిడ్ మిల్లర్(116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగగా.. అత‌నికి తోడుగా హెన్రీచ్ క్లాసెన్(48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్ద‌రు కాస్త ఓపిక‌గా ఆడ‌డం వల్ల‌నే సౌతాఫ్రికా ఆ మాత్రం స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాని త‌క్కువ స్కోరుకి క‌ట్ట‌డి చేశారు.

ఇక 213 పరుగుల స్వల్ప లక్ష్య చేధ‌న‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్(29) మంచి ఆరంభాన్ని అందించారు. 60 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మార్క్‌రమ్ విడదీసాడు. అనంత‌రం క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్(0) డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.. హెడ్ అర్ధ సెంచ‌రీ అయ్యాక పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. మార్నస్ లబుషేన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను షంసీ ఔట్ చేయడంతో మ్యాచ్ మ‌ళ్లీ సౌతాఫ్రికా వైపు ట‌ర్న్ అయింది. స్మిత్ విజ‌య‌లాంచ‌నం పూర్తి చేస్తాడు అని అంద‌రు భావిస్తున్న స‌మ‌యంలో చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్(6)తో జోష్ ఇంగ్లీస్ కొద్ది సేపు వికెట్ ప‌డకుండా ఆడారు.

అయితే కోయిట్జీ ఇంగ్లీస్ ని క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(14 నాటౌట్), మిచెల్ స్టార్క్(17 నాటాట్ ) మాత్రం మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడి ఆసీస్‌ని గెలిపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుసార్లు సెమీస్ ఆడిన సౌత్ ఆఫ్రికా ఒక్క‌సారి కూడా ఫైన‌ల్‌కి చేరుకోలేదు. అయితే ఓట‌మి త‌ర్వాత బ‌వుమా చాలా బావోద్వేగానికి గుర‌య్యాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి డికాక్ కి ఘ‌న‌మైన వీడ్కోలు ఇవ్వాల‌ని అనుకున్నాం. కాని అది కుద‌ర‌లేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి.