ఆహారంగా 39 నాణేలు, 37 అయస్కాంతాలను మింగిన వ్యక్తి
ఓ యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అతను బాడీ బిల్డింగ్ కోసం జింక్ సహాయం చేస్తుందని 39 నాణేలు, 37 అయస్కాంతాలను మింగేశాడు.

న్యూఢిల్లీ : ఓ యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న అతను బాడీ బిల్డింగ్ కోసం జింక్ సహాయం చేస్తుందని నమ్మాడు. ఈ క్రమంలో ఆ యువకుడు ఆహారంగా 39 నాణేలు, 37 అయస్కాంతాలను మింగేశాడు. కానీ ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియదు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 26 ఏండ్ల యువకుడికి 20 రోజుల క్రితం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆహారం కూడా ఏం తినలేకపోతున్నాడు. వాంతులు చేసుకుంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ ఆ యువకుడిని పరీక్షించారు. ఆ తర్వాత యువకుడికి ఎక్స్ రే నిర్వహించారు. అతని కడుపులో భారీ మొత్తంలో నాణేలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మళ్లీ సీటీ స్కాన్ నిర్వహించగా, నాణేలు, అయస్కాంతాలు కుప్పలుకుప్పలుగా కనిపించాయి. అవి పేగులను మొత్తం బ్లాక్ చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో క్షణం ఆలోచించకుండా అతనికి సర్జరీ నిర్వహించారు. యువకుడి కడుపులో నుంచి 39 నాణేలు, 37 అయస్కాంతాలను వైద్యులు బయటకు తీశారు.
ఇక నాణేలన్ని ఒకటి, రెండు, ఐదు రూపాయాల కాయిన్స్ అని డాక్టర్లు తెలిపారు. అయస్కాంతాలేమో హార్ట్, స్టార్, బుల్లెట్, ట్రయాంగిల్ సింబల్‌తో ఉన్నాయని పేర్కొన్నారు. రోగి ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అయితే శరీర నిర్మాణానికి జింక్ సహాయపడుతుందనే ఉద్దేశంతోనే వీటిని మింగినట్లు డాక్టర్ల విచారణలో తేలింది. గత కొన్నాళ్ల నుంచి అతను నాణేలు, అయస్కాంతాలు మింగుతున్నట్లు డాక్టర్‌కు కుటుంబ సభ్యులు తెలిపారు. మానసిక సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు వివరించారు.