Hyderabad | గ్రూప్-2 అభ్యర్థిని ఆత్మహత్య.. అశోక్‌నగర్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత

Hyderabad | ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న ఓ నిరుద్యోగ అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక(23) అశోక్‌నగర్‌లోని ఓ ప్రయివేటు హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2కు ప్రిపేరవుతోంది. అయితే శుక్రవారం రాత్రి తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఫ్యాన్‌కు వేలాడుతున్న ప్రవళికను హాస్టల్‌లో ఉంటున్న మిగతావారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. అప్పటికే వందల మంది నిరుద్యోగులు అక్కడికి చేరుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతదేహాన్ని గాంధీకి తరలించకుండా అడ్డుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరుద్యోగుల నిరసన కొనసాగింది. చివరకు పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో నిరుద్యోగులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాత్రి ఒంటి గంట సమయంలో ప్రవళిక డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రవళిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నేను చాలా నష్టజాతకురాలిని..
ప్రవళిక రాసిన సూసైడ్ నోట్‌గా చెబుతున్న లేఖ వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టింది. నన్ను క్షమించండి అమ్మా..! నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా.. నాన్న జాగ్రత్త అంటూ ఆ లేఖలో రాసి ఉంది. ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.