Hush Money Case | మాజీ శృంగార తార స్టోమీ డేనియల్స్‌తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా అనైతికంగా ఒప్పందం చేసుకున్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు చిక్కులు తప్పేలా లేవు. ట్రంప్‌పై ఈ కేసు వచారణకు తేదీ ఖరారైంది. న్యూయార్క్ న్యాయమూర్తి ఈ కేసులో విచారణ తేదీని ఏప్రిల్ 15గా నిర్ణయించారు. ట్రంప్‌పై తొలి క్రిమినల్ కేసు కావడం గమనార్హం. సోమవారం విచారణ సందర్భంగా.. విచారణను వాయిదా వేయాలని ట్రంప్ న్యాయమూర్తిని కోరారు. అయితే, ట్రంప్ అభ్యర్థనలన్నింటినీ తోసిపుచ్చిన న్యాయమూర్తి జువాన్ మెర్చన్ ఏప్రిల్ 15న విచారణ ప్రారంభించాలని ఆదేశించారు. నివేదిక ప్రకారం, ట్రంప్‌పై విచారణ సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ కార్యాలయం విచారణను ఆలస్యంగా జరిపేందుకు అంగీకరించింది. ఈ కేసులో లక్షకుపైగా పేజీల రికార్డులను న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం గతంలో బహిర్గతం చేసింది.
ఆ డాక్యుమెంట్లను ముందే ఎందుకు ముందుకు తీసుకురాలేదని ఈ కేసుతో సంబంధం ఉన్న పార్టీలు ఆరోపించాయి. సోమవారం విచారణ ప్రారంభించడానికి బదులుగా.. డాక్యుమెంట్ వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు పక్షాలు సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దాదాపు అర డజను మంది లాయర్లతో ట్రంప్ విచారణకు హాజరయ్యారు. విచారణ సమయంలో ట్రంప్ చాలా వరకు మౌనంగా ఉండి న్యాయమూర్తి వైపు చూస్తూనే ఉన్నారు. విచారణ తర్వాత, నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం చేయకుండా నిరోధించడానికి కేసును లేవనెత్తారని ట్రంప్ ఆరోపించారు. మూడున్నరేళ్ల కిందటే కేసు పెట్టి ఉండవచ్చునన్నారు. ఇప్పుడు ఆయన చాలా రోజులుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల సమయంలో ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయాలని ప్రత్యర్థులు భావిస్తున్నారన్నారు. ఇది ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని అన్నారు. కేసు వివరాల్లోకి వెళితే.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డోనాల్డ్ ట్రంప్ మాజీ శృంగార తార స్టోమీ డేనియల్స్‌తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బులు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలున్నాయి.
లేక్ టాహోలో జరిగిన సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో శృంగార తార, ట్రంప్ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన కేసు ఇది. ఇందుకు సంబంధించిన వివరాలను డేనియల్స్ తన స్వీయ పుస్తకం ‘ఫుల్ డిస్క్లోజర్’లో వెల్లడించింది. తాను ట్రంప్‌తో శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపింది. అయితే, వాటిని మాజీ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. 2006 నాటి ఆ సంబంధం గురించి బయటపెట్టకుండా ఉండేందుకు డేనియల్స్‌కు 130,000 డాలర్లు అప్పటి మేనేజర్ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ ఈ మొత్తాన్ని చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. స్టోమీ డేనియల్స్, డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందంపై 2018లో శృంగార తార కోర్టుకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ట్రంప్ మాత్రం తాను ఎప్పుడూ డేనియల్స్‌తో సెక్స్‌లో పాల్గొనలేదని.. ఎన్నికల ప్రచార సమయంలో సంబంధం బయటపడకుండా డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే, ట్రంప్‌పై కేసును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని న్యూయార్క్ జ్యూరీ ఇప్పటికే నిరార్ధరించింది.