లోకల్ బాయ్ విజృంభణ… నాలుగో రోజే ఇంగ్లండ్‌ని చుట్టేసిన భారత్

టీమిండియా విజృంభణ మొదలైంది. రెండో టెస్ట్‌లో గెలిచిన భారత్ మూడో టెస్ట్ లోను గెలిచి చరిత్ర సృష్టించింది. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్ 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి అత్యంత భారీ విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 114 పరుగులు మాత్రమే చేయడంతో భారత్‌కి ఘన విజయం దక్కింది. లోకల్ బాయ్ రవీంద్ర జడేజా 5 వికెట్స్ దక్కించుకొని టీమిండియాకి మంచి విజయాన్ని అందించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్క్ వుడ్ క్యాచ్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ జట్టు తన చివరి వికెట్‌ను కోల్పోవడం భారత్‌కి విజయం దక్కడం జరిగింది.
ఈ రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ శుభ్‌మన్ గిల్, కుల్దీప్ మొదలు పెట్టారు. అయితే 912 పరుగుల వద్ద గిల్ రనౌట్ కావడం, అప్పుడు క్రీజులోకి యశ్వసి జైస్వాల్ రావడం జరిగింది. ఇక కుల్దీప్ ఔటయిన తర్వాత సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరు పరుగల వరద పారించారు. యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) అదరగొట్టారు. ఈ క్రమంలో భారత్ 430 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ 557 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇక భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపకపోవడంతో విజయం సులువు అయింది.
బెన్ డకెట్ (4; 15 బంతుల్లో), జాక్ క్రాలే (11; 26 బంతుల్లో), ఒలీ పోప్ (3; 14 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (4; 3 బంతుల్లో), జో రూట్ (7; 40 బంతుల్లో), బెన్ స్టోక్స్ (15; 39 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (0) వరుసగా పెవిలియన్‌కు చేరారు. బెన్ ఫోక్స్ (16; 39 బంతుల్లో)తో కలిసి టామ్ హర్ట్‌లీ (16; 36 బంతుల్లో) కాసేపు వికెట్ పడకుండా అడ్డుకున్నప్పటికీ విజయం భారత్ చెంత చేరింది. జడేజా అయిదు వికెట్లు, కుల్‌దీప్ రెండు, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. దీంతో టీమిండియా 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిరంజన్ షా స్టేడియంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో అంత భారీగా విజయం పొందడం ఇదే తొలిసారి. అంతకుముందు 2021లో ముంబైలోని వాంఖడే మైదానంలో భారత జట్టు 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.