Site icon vidhaatha

ఎన్నికల నేపథ్యంలో జేడీయూ అధ్యక్షుడి మార్పు.. మళ్లీ నితీశ్‌కే పగ్గాలు

లలన్‌ సింగ్‌ రాజీనామా

పాట్నా: బీహార్‌ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకున్నది. జేడీయూ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మళ్లీ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు నిర్వహించిన రాజీవ్‌ రంజన్‌ అలియాస్‌ లలన్‌సింగ్‌ శుక్రవారం జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో రాజీనామా సమర్పించారు. నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు, వాటికి ఖండనలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి శుక్రవారం నాటి సమావేశంతో తెరపడనట్టయింది. రాబోయే ఎన్నికల్లో మరింత దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు లలన్‌సింగ్‌ తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. అనంతరం నితీశ్‌కుమార్‌ను తదుపరి అధ్యక్షుడిగా ఆయన ప్రతిపాదించగా సభ్యుల ఆమోదంతో ఆయన ఎన్నికయ్యారు. జేడీయూ ప్రధాన కార్యదర్శి రామ్‌కుమార్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ మొదట లలన్‌సింగ్‌ రాజీనామా సమర్పించగా ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని తెలిపారు. ఆ వెంటనే నితీశ్‌కుమార్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ మరో తీర్మానాన్ని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదించిందని చెప్పారు. గత కొంతకాలం నుంచి జేడీయూ అధ్యక్షుడి మార్పుపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. కానీ.. పార్టీ సీనియర్‌ నేతలు ఎవరూ దీనిపై నోరువిప్పలేదు. కొందరు ఖండించారు కూడా. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ సైతం లలన్‌సింగ్‌ రాజీనామా చేస్తారన్న గతంలో వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని తేల్చారు.

జేడీయూ నాయకత్వ మార్పుపై బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జీతన్‌ రాం మాంఝీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘నితీశ్‌ మూడేళ్ల పాలనలో లలన్‌సింగ్‌ కూడా తుడిచిపెట్టుకుపోయారు. జార్జి ఫెర్నాండెజ్‌ను, ఆర్సీపీ సింగ్‌, శరద్‌యాదవ్‌ వంటివారినే నితీశ్‌కుమార్‌ పట్టించుకోలేదు.. ఇక మీరెంత అనే విషయాన్ని లలన్‌ బాబు అర్థం చేసుకోవాలి. నితీశ్‌ వెన్నుపోటు పొడవని వ్యక్తి లేరు’ అని పేర్కొన్నారు.


అత్యంత కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ తిరిగి జేడీయూ అధినేతగా పగ్గాలు స్వీకరించడం వ్యూహాత్మకమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నితీశ్‌ కొత్త పాత్రలో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు, బీహార్‌లో సీట్ల పంపకాలపై మరింత చొరవ చేసేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి నేతలతో చర్చలు ప్రారంభించే బాధ్యతలను నితీశ్‌కు అప్పగిస్తూ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో తీర్మానం కూడా ఆమోదించారు.


బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటివారు ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించినా.. పలువురు జేడీయూ నేతలు మాత్రం నితీశ్‌కుమార్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ సమావేశం వద్ద నితీశ్‌కుమార్ ఫొటోలతో ‘ప్రదేశ్‌ నే పెహచానా.. అబ్‌ దేశ్‌ భీ పెహచానేగా (బీహార్‌ రాష్ట్రం ఇప్పటికే గుర్తించింది.. ఇక దేశం కూడా) అని పోస్టర్లు వెలిశాయి.

Exit mobile version